Mahabubnagar | మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ ఇక నుంచి కార్పొరేషన్‌గా మారనున్నది. ఇప్పుడున్న బల్దియాకు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లీపూర్తోపాటు మరో గ్రామాన్ని విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వార్డుల సంఖ్యను పెంచుతూ కార్పొరేషన్ స్థాయికి అవసరమైన జనాభాను లెక్కించి ప్రతిపాదనల్లో పొందుపర్చారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పాలమూరు పట్టణం ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతున్నది. బైపాస్‌లు, జాతీయ రహదారుల అనుసంధానంతో రూపురేఖలు మారుతున్నాయి. మార్కెట్లు, జంక్షన్లు, రహదారులు, మౌలిక వసతుల కల్పనపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, మినీ ట్యాంక్‌బండ్, శిల్పారామం, ఐలాండ్, ఐటీ టవర్ ఏర్పాటుతో జిల్లా కేంద్రం దినదినాభివృద్ధి చెందుతున్నది. హైదరాబాద్ చుట్టుపక్కల పట్టణాల తలసరి ఆదాయంతో పోటీ పడుతున్నది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పా లమూరు దశాదిశ మారుతున్నది. ఏకంగా కార్పొరేషన్స్థాయికి వేగంగా అడుగులు వేస్తున్నది. తెలంగాణ వచ్చాక ఎనిమిదేండ్లల్లో పట్టణం ఊహించని రీతిలో అభివృద్ధి చెందు తున్నది. కొత్త మున్సిపల్ గైడ్‌లైన్స్ ప్రకారం విలీన గ్రామాలను కలుపుకొని గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా అవతరించింది. తాజా గా మరిన్ని సమీప గ్రామాలను కలుపుకొని మున్సిపల్ కార్పొరేషన్ కోసం కలెక్టర్ నేతృత్వంలో తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఇప్పటికే జిల్లాకేంద్రంలోని ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయలను మున్సిపాలిటీ కల్పిస్తున్నది. మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ఏర్పాటు చేయడం కూడా కలిసొచ్చింది. రియల్ఎస్టేట్ రంగం పుంజుకొని అనేక కాలనీలు వెలుస్తున్నాయి. అపార్ట్మెంట్ కల్చర్, ఇండిపెండెంట్ హౌస్‌లతోపాటు విల్లా సం స్కృతి కూడా అడుగిడింది. కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడున్న గ్రామాలతోపాటు దివిటిపల్లి, ధర్మాపూర్, జైనల్లిపూర్తోపాటు మరో గ్రామాన్ని కలిపి ప్రతిపాదించగా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నది.
ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్‌నగర్ పట్టణంలో తాగునీటి క ష్టాలు వర్ణనాతీతం. అప్పటి ప్రభుత్వాలు తాత్కాలికంగా నీటి ఎద్దడిని నివారించారే తప్పా శాశ్వత ప్రణాళికలు చూపకపోవడంతో సమస్య తీవ్రతరమైంది. నెలకు రెం డుసార్లు తాగునీళ్లు ఇచ్చే దుస్థితి ఉండేది. ఎంపీ, ఎమ్మెల్యేల నిధుల నుంచి బోర్లను త వ్వి కోట్ల రూపాయల నిధులను వృథా చేసి రిగ్గుల యజమానులను బతికించారు. దగ్గర్లో ఉన్న కోయిల్‌సాగర్‌ను కాదని, రామన్‌పాడు నుంచి పైప్లైన్లు వేసినప్పటికీ విఫలమైంది. సుదూరం నుంచి నీటి సరఫరా ఉండడంతో చాలా చోట్ల రైతులు పైప్లైన్లను పగులగొట్టి పట్టణానికి వచ్చే నీటిని ఆపేశారు. పైప్‌లైన్ లీకేజీల పేరిట అనేక అక్రమాలకు పాల్పడి నిధులను దిగమింగారు. పురపాలకులు కూడా నిర్లక్ష్యం చేయడంతో పట్టణ విస్తీర్ణానికి బ్రేక్ పడింది. గాగునీటి ఎద్దడి కారణంగా నిర్మాణ, రి యల్, వ్యాపార రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాయ్ తా గితే తప్పా నీళ్లు లభించని పరిస్థితికి పాలమూరు చేరుకుంది. దీంతో పాలమూరులో ఉండలేమనే భావన ప్రజలతోపాటు పెట్టుబడి వర్గాల్లోకి వచ్చింది. క్రమంగా పట్టణ ప్రగతి అటకెక్కగా.. వ్యాపారస్తులు మహానగరాలకు తరలారు.
తెలంగాణ వచ్చాకే పాలమూరు పరిస్థితి తారుమారైంది. శ్రీనివాస్‌గౌడ్ రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పాలమూరు రూపురేఖలే మారిపోయాయి. వచ్చిన రెండేళ్లల్లోనే తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపారు. రామన్‌పాడు, కోయిల్‌సాగర్ మంచినీటి పథకాలను పూర్తిగా కంట్రోల్ చేసి నెలలో పది రోజులు మంచినీరు అందేలా చేశారు. ఆ తర్వాత రెండ్రోజులకోసారి నీళ్లు వచ్చేలా పరిస్థితిని చక్కదిద్దారు. ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చి నగరాలు, పట్టణాలు, గ్రామాలకు శుద్ధజలాన్ని సరఫరా చేయడంతో పాలమూరు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
జడ్చర్ల-మహబూబ్‌నగర్ జాతీయ రహదారిని మరో జాతీయ రహదారి 44తో అనుసంధానించి పట్టణం మీదుగా తీసుకెళ్లారు. దీంతో నాలుగు లేన్ల రహదారి.. మధ్యలో పచ్చని చెట్లు పాలమూరు స్వరూపాన్నే మార్చేశాయి. అప్పన్నపల్లి ఆర్వోబీని కూడా పూర్తిచేయడంతో ట్రాఫిక్ సమస్య తీరింది. భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా బైపాస్‌ను ఏర్పాటు, భూత్పూర్-మహబూబ్‌నగర్ రహదారిని నాలుగు లేన్లుగా మార్చడంతో పట్టణంలో రవాణ వ్యవస్థ మెరుగుపడింది. కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, ట్యాంక్‌బండ్, శిల్పారామం, ఐల్యాండ్, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లు, జంక్షన్లు, గల్లీల్లో సీసీ రోడ్లు, భవిష్యత్ తరాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించడంతో మున్సిపల్ ఆదాయం గణనీయంగా పెరిగింది. తాజాగా అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ (ముడా)ని తీసుకొచ్చి పట్టణ ప్రగతికి బాటలు వేశారు. దివిటిపల్లి వద్ద ఐటీ టవర్ ప్రారంభంతో పాలమూరు మహానగరంగా విస్తరిస్తూ.. హైదరాబాద్ చుట్టుపక్కల నగరాల తలసరి ఆదాయంతో పోటీపడుతున్నది.
మున్సిపాలిటీ ఆదాయ వనరులు భారీగా పెరగడంతోపాటు మౌలిక సదుపాయాలను విస్తరించడంతో కార్పొరేషన్‌గా మార్చాలని జిల్లా అధికార యంత్రాంగం తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పుడున్న వీలిన గ్రామాలతోపాటు ఇటీవల దివిటిపల్లి ఐటీ కారిడార్‌ను ప్రారంభించడంతో పాలమూరు కీర్తి మరింత పెరిగింది. రూ.10వేల కోట్ల పెట్టుబడితో లిథియం బ్యాటరీ పరిశ్రమ, ఐటీ టవర్‌లో ఎనిమిది సాఫ్ట్వేర్ కంపెనీలు రావడంతో దివిటిపల్లిని కూడా కార్పొరేషన్లో విలీనం చేయాలని ప్రతిపాదించారు. జనాభాతోపాటు కార్పొరేషన్‌కు అవసరమైన ఆదాయ వనరులు అన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్రజలు సేద తీరేందుకు దేశంలోనే అతిపెద్ద ఎకోపార్కు అందుబాటులోకి రావడంతోపాటు జంగల్ సఫారీకి వేదికైంది. తాజాగా పర్యాటక శాఖ నుంచి పెద్ద స్టార్ హోటల్, ఐమాక్స్ థియేటర్ ఉండే కమర్షియల్ కాంప్లెక్స్ పనులు పట్టణంలో ప్రారంభమయ్యాయి. కార్పొరేట్స్థాయికి తగ్గట్లు వెయ్యి పడకల దవాఖానను నిర్మించనున్నారు.
మహబూబ్‌నగర్ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. గతంలో తాగునీళ్ల కోసం గోసపడిన పట్టణంలో ఇవాళ పుష్కలంగా నీరు లభిస్తున్నది. పార్కులను అభివృద్ధి చేసినం. మున్సిపాలిటీ ఆదాయాన్ని రెట్టింపు చేశాం. ఐటీ టవర్, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు, జాతీయ, బైపాస్ రహదారులు.. భవిష్యత్‌లో పాలమూరు చుట్టూ రింగ్‌రోడ్డు వేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని కూడా ఏర్పాటు చేశాం. పాలమూరుకు కార్పొరేషన్ హోదా కల్పించి మహానగరాల సరసన నిలబెడతాం.
– శ్రీనివాస్‌గౌడ్, క్రీడాశాఖ మంత్రి
పాలమూరు మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మార్చాలనే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించాం. కార్పొరేషన్‌కు అవసరమైన అన్ని అర్హతలూ పాలమూరుకు ఉన్నాయి. మౌలిక సదుపాయాల్లో కూడా పట్టణం ముందుండగా.. ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. కొత్త చట్టం
ప్రకారం జనాభా కూడా సరిపోతుండడంతో ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
– జి.రవినాయక్, కలెక్టర్, మహబూబ్‌నగర్