దామరగిద్ద : కూరగాయలు పండించడం వల్ల రైతులకు అధికంగా లాభాలు వచ్చే అవకాశం ఉందని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ దామరగిద్దలో మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా బిద్ గ్రామ పంచాయతీ శివారులో ఉన్న శంకర్ పొలం వద్ద కలెక్టర్ కాసేపు ఆగారు. కాకరకాయ, సొర, టమాటా పంటలను పరిశీలించారు. హాని బాక్స్‌లపై అవగాహన కల్పించి రైతులకు వాటిని అందజేస్తామని కలెక్టర్ తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా గత్ప గ్రామంలో నిర్వహిస్తున్న భూ భారతి రైతు సదస్సు కేంద్రాన్ని సందర్శించారు. ఈ గ్రామంలో నిర్వహించిన సదస్సులో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనే వివరాలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను పరిశీలించి నోటిస్ ఇవ్వాలని, అనంతరం పరిష్కరించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని మంజూరు అయ్యాయి..? అందులో గ్రౌండింగ్ ఎంత అయిందని అడిగి తెలుసుకున్నారు.
గత్ప గ్రామ పర్యటన కంటే ముందు దామరగిద్ద కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ప్రారంభమై నాలుగు రోజులు అవుతున్న నేటికీ విద్యార్థులు రాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని సూచించారు. రెండు రోజులలో అందరు విద్యార్థులు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా కానుకుర్తి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ క్యాంప్‌ను కలెక్టర్ పరిశీలించారు. యోగా డే సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. నూతనంగా అడ్మిషన్ పొందిన విద్యార్థులతో కలెక్టర్ సంభాషించి పాఠశాల వసతుల పై ఆరా తీశారు.