జడ్చర్ల టౌన్, జూలై 16 : రాష్ట్ర ప్రభుత్వం భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుల్, ఎస్సైతోపాటు అనేక ఉద్యోగాల భర్తీకి పూనుకున్నది. కానీ, పోటీ ప్రపంచంలో సర్కార్ కొలువు సాధించాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాలకు వెళ్లి ప్రైవేట్ కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక పరిస్థితులు అంతగా లేవు. ఈ తరుణంలో జడ్చర్ల నియోజకవర్గంలోని నిరుద్యోగుల కోసం ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి.. సీఎన్ఆర్ ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పీజేఆర్ కోచింగ్ సెంటర్ సహకారంతో 250 మందికి మూడు నెలలుగా ఉచిత శిక్షణనందిస్తున్నారు. అంతేకాకుండా నిత్యం మధ్యాహ్న భోజన వసతిని కల్పిస్తున్నారు. వివిధ మండలాలకు చెందిన యువతీయువకులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉచిత శిక్షణతో కచ్చితంగా కొలువు సాధిస్తామన్న ఆత్మవిశ్వాసం పెరిగిందని అభ్యర్థులు చెబుతున్నారు. 13 మంది నిపుణులతో పోటీ పరీక్షల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ ఆరుగంటలపాటు నిర్విరామంగా తరగతులు నిర్వహిస్తుండడంతో అభ్యర్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, భారతదేశ చరిత్ర, ఆర్థమెటిక్, రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ పాలిటిక్స్, బయోలజీ, జాగ్రఫీ తదితర సబ్జెక్టులను బోధిస్తున్నారు.
అవగాహన ఏర్పడింది..
మాది వ్యవసాయ కుటుంబం. 2018లో బీటెక్ పూర్తి చేశాను. గ్రూప్స్ రాసేందుకు సిద్ధమవుతున్నాను. ఈ కో చింగ్ సెంటర్‌కు రాకముందు కొన్ని సబ్జెక్టులపైనే అవగాహన ఉండేది. ఇప్పుడు కోచింగ్ క్లాసులు విన్న తర్వాత నాకు తెలియని ఎన్నో విషయాలపై అవగాహన వచ్చింది. ఉచిత శిక్షణ తరగతులతోపాటు భోజన వసతి కల్పించారు. గ్రూప్స్ ఉద్యోగం సాధిస్తానన్న నమ్మకం వచ్చింది.
– రాజేశ్వరి, బీటెక్ విద్యార్థిని, జడ్చర్ల
కానిస్టేబుల్ కొలువు సాధిస్తా..
జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ సెకండియర్ చదువుతున్నాను. పోలీస్ ఉద్యోగం సాధించాలన్నదే నా లక్ష్యం. ప్రైవేట్ కోచింగ్ తీసుకునేందుకు ఆర్థిక పరిస్థితులు లేవు. సీఎన్ఆర్ ఫౌండేషన్ వారు నిర్వహించిన ఉచిత శిక్షణ తరగతులకు హాజరవుతున్నాను. ఇక్కడ ఆర్థమెటిక్, రీజనింగ్, సోషల్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ ఎఫైర్స్, చరిత్ర సబ్జెక్టులు బోధిస్తున్నారు. మూడు నెలల పాటు శిక్షణ తరగతుల్లో నేర్చుకున్న అంశాలు ఎంతో ఉపయోగపడతాయి. తప్పకుండా కానిస్టేబుల్ ఉద్యోగం సాధిస్తాను.
– జే.ప్రవీణ్‌కుమార్‌నాయక్, సింగందొడ్డి, మిడ్జిల్ మండలం
గ్రూప్స్ కోసం ప్రిపేరవుతున్నా..
గ్రూప్స్ ఉద్యోగం కోసం ప్రిపేరవుతున్నాను. జడ్చర్లలో ఉచిత కోచింగ్ ఇస్తున్నారని తెలుసుకొని ఇక్కడకు వచ్చాను. ప్రతిరోజూ శిక్షణ తరగతులకు హాజరవుతున్నాను. జాగ్రఫీ, పాలిటిక్స్, రీజనింగ్, బయోలజీ, జనరల్ నాలెడ్జ్, ఆర్థమెటిక్స్ సబ్జెక్టులను బోధిస్తున్నారు. ప్రతిరోజూ మోడల్ పరీక్షలు నిర్వహించి సబ్జెక్టులపై ఏ విధంగా పట్టు ఉందో తెలుసుకుంటున్నారు. ఉచిత కోచింగ్ ఇస్తున్న సీఎన్ఆర్ ఫౌండేషన్ నిర్వాహకులకు కృతజ్ఞతలు. ఈ ఉచిత శిక్షణ నా ప్రిపరేషన్‌కు ఎంతో ఉపయోగపడుతుంది. – పి.రాణి, ఏనుగొండ, మహబూబ్‌నగర్
ఆరుగంటల పాటు శిక్షణ..
సీఎన్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పీజేఆర్ సౌజన్యంతో మూడు నెలలుగా ఉచిత కోచింగ్ కొనసాగుతున్నది. పీజేఆర్ కోచింగ్ సెంటర్ నుంచి 13 మంది వివిధ సబ్జెక్టుల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజూ ఆరు గంటల పాటు సబ్జెక్టులను బోధిస్తున్నాం. 250 మంది యువతీయువకులు తరగతులకు హాజరవుతున్నారు. తెలంగాణ, భారతదేశ చరిత్ర, ఆర్థమెటిక్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ తదితర అంశాలపై తరగతులు నిర్వహిస్తున్నాం. అభ్యర్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. శిక్షణ తరగతులకు హాజరవుతున్న అభ్యర్థులు పూర్తిస్థాయిలో శిక్షణ పొందుతున్నారు.
– లింగన్న, శిక్షకుడు