Dhurandhar 2 | ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ధురంధర్: ది రివెంజ్’ ఈ ఏడాది మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే మొదటి భాగం సాధించిన అద్భుత విజయంతో ఈ సీక్వెల్‌పై సినీ వర్గాల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్‌లో ఉన్న మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సన్నివేశాలు, కథన శైలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో రెండో భాగాన్ని మరింత భారీ స్థాయిలో తెరకెక్కించారని చిత్ర యూనిట్ చెబుతోంది. ప్రేక్షకులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
గతంలో మొదటి భాగం విడుదల సమయంలో గల్ఫ్ దేశాల్లో ఈ సినిమా నిషేధానికి గురవ్వడం నిర్మాతలకు పెద్ద దెబ్బగా మారింది. ఆ నిషేధం కారణంగా దాదాపు 100 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే థియేట్రికల్ రిలీజ్‌కు అడ్డంకులు ఎదురైనా, డిజిటల్ ప్లాట్ఫామ్లో విడుదలైన తర్వాత ఈ సినిమా అప్రతిహతమైన విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్‌లో గల్ఫ్ దేశాల్లోనే అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచి రికార్డు సృష్టించడం విశేషం. అంతేకాకుండా పాకిస్థాన్‌లో కూడా ఈ చిత్రానికి అనూహ్యమైన ఆదరణ లభించడం చిత్ర బృందానికి ఊరటనిచ్చింది.
ఈసారి మాత్రం గల్ఫ్ దేశాల్లో సెన్సార్ అనుమతులు పొందడం మేకర్స్‌కు పెద్ద సవాల్‌గా మారింది. అక్కడ విడుదలకు మార్గం సుగమమైతే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రావడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. మొదటి భాగంలో జరిగిన చిన్న చిన్న తప్పులను సరిదిద్దుకుంటూ, కథనం నుంచి టెక్నికల్ అంశాల వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుని ఈసారి చిత్రాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందించారని సమాచారం. యాక్షన్, ఎమోషన్, విజువల్ గ్రాండియర్ కలయికగా వస్తున్న ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.