మహబూబ్నగర్, జూలై 16 : పర్యావరణ పరిరక్షణలో భాగంగా పాముల సంరక్షణకు పాటుపడాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. ప్రపంచ పాముల దినోత్సవాన్ని పురస్కరించుకొని అసోసియేషన్ ఫర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ డెవలప్మెంట్ సంస్థ డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల జడ్చర్ల, జాతీయ సేవాపథకం సంయుక్తంగా రూ పొందించిన ‘పాములను బ్రతకనిద్దాం’ పోస్టర్లను శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాముల సంరక్షణతో పర్యావరణానికి మేలు చేకూరుతుందన్నారు. పాములను కాపాడేందుకు జడ్చర్ల డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర అధ్యాపకుడు బి.సదాశివయ్య చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. పాముల పరిరక్షణతోపాటు జడ్చర్ల కళాశాలలో ఏర్పా టు చేసిన తెలంగాణ బొటానికల్ గార్డెన్ రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కళాశాల అభివృద్ధికి తమవం తు సహకారం అందిస్తామని కలెక్టర్ తెలిపారు. సదాశివయ్య సేవలను హరితహారం కార్యక్రమానికి వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ అదెప్ప, డాక్టర్ మునిస్వామి, పరిశోధక విద్యార్థులు రామకృష్ణ, రమాదేవి పాల్గొన్నారు.