గద్వాల అర్బన్, జూలై 16: విద్యార్థులు విజయాలు సాధించినప్పుడు పొంగిపోకుండదు, ఓటమి వచ్చినప్పుడు కృంగిపోకుండా ముందుకు సాగడమే ప్రధాన కర్తవ్యమని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ పేర్కొన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మేము సైతం కార్యక్రమంలో భాగంగా పదో తరగతి, ఇంటర్లో ఉత్తమ ప్రతిభకనబర్చి మంచి ఫలితాలను సాధించిన విద్యార్థులను ఎస్పీ ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు ఇంతటితో ఆగకుండా సరైన ప్రణాళికను నిర్దేశించుకొని ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఒక్కప్పుడు చదువుకునేందుకు ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదని, అయినప్పుటికీ ఎందరో ఉన్నత చదువులు చదివి ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని తెలిపారు. ఒకవ్యక్తి విద్యలో ఉన్నత స్థితికి చేరడంలో గురువులు, తల్లిదండ్రులదే ప్రముఖ పాత్ర అని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకున్నాక మనకు సాయం చేసిన వ్యక్తులను మర్చిపోకూడదని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములు నాయక్, డీఎస్పీ రంగస్వామి, సీఐలు చంద్రశేఖర్, శివశంకర్, ఎస్సైలు తదితరులు ఉన్నారు.
నిందితులకు శిక్షపడేలా కృషి చేయాలి
దర్యాప్తులో ఉన్న కేసుల్లో సమగ్ర విచారణ చేపట్టి చట్టపరంగా నేరస్తులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలని ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ పోలీసు అధికారులకు తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో శనివారం నెలవారీ నేరసమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలీసుస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలను పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. సమగ్ర విచారణతో నిందితులకు శిక్షపడేవిధంగా చేసి బాధితులకు న్యాయం చేకూరేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పోలీస్‌స్టేషన్‌లో సైబర్‌నేరాలపై అవగాహన కల్పించాలని, నేరాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రదేశాలు గుర్తించి పాయింట్ బుక్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్, డీఎస్పీ రంగస్వామి, సీఐ చంద్రశేఖర్, శివశంకర్, పోలీస్‌లు ఉన్నారు.