ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండగా గేట్లెత్తారు. తుంగభద్ర డ్యాంకు 1.12 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 30 గేట్ల నుంచి 1.52 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. దీంతో ఆర్డీఎస్ ఆనకట్టకు, సుంకేసుల బ్యారేజీకి వరద గంటగంటకూ పెరుగుతున్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు 1.48 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. సుంకేసుల బ్యారేజీకి 1.31 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. 25 గేట్ల నుంచి 1.31 లక్షల క్యూసెక్కులు శ్రీశైలం డ్యాం వైపు పరుగులు తీస్తున్నాయి. జూరాల ప్రాజెక్టుకు 1.40 లక్షల క్యూసెక్కులురాగా.. 23 గేట్ల నుంచి 1.39 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. శ్రీశైలం జలాశయానికి 2.45 లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నది.
అయిజ, జూలై 15 : తుంగభద్ర నది పరవళ్లు తొ క్కుతున్నది. వరద నీరు భారీగా చేరుతుండడంతో శుక్రవారం 30గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. టీబీ డ్యాంలోకి 1,12,430క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 1,52,501క్యూసెక్కులు ఉన్నది. 105. 788 టీఎంసీల సామర్థ్యం గల టీబీ డ్యాంలో ప్ర స్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం 94.857 టీఎంసీలు ఉన్నది. 1633అడుగుల నీటి మట్టానికి గానూ, 16 30.21అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. వరద ప్రవాహంను బట్టి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
వరదకు తోడు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఆర్డీఎస్ ఆనకట్ట జలకళను సంతరించుకున్నది. శుక్రవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 1,48,404 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, 1,48,100క్యూసెక్కుల వరద నీరు ఆనకట్టపై నుంచి సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 304క్యూసెక్కుల నీరు చేరుతున్నట్లు కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 13.6అడుగుల మేర నీటి మట్టం నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. తుంగభద్ర నదికి భారీగా చేరుతుండటంతో అయిజ మండలం పులికల్ సమీపంలోని నాగల్‌దిన్నె వంతెన వద్ద వరద ప్రవాహం కొనసాగుతున్నది.
సుంకేసుల బ్యారేజీలో..
రాజోళి, జూలై 15 : సుంకేసుల బ్యారేజీకి టీబీ డ్యాం నుంచి వస్తున్న వరద గంటగంటకూ పెరుగుతున్నది. బ్యారేజీకి 1,31,933క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ఏఈఈ రాజు తెలిపారు. దీంతో బ్యారేజీలో 25 గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 1,31,428 క్యూసెక్కులు దిగువన ఉన్న శ్రీశైలం డ్యాంకు వదులుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 0.461 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.
జూరాలకు లక్షా 40వేల క్యూసెక్కులు
అమరచింత, జూలై 15: అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి రోజురోజుకూ జూరాలకు డ్యాంకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో ప్రాజెక్టులో కృష్ణమ్మ ఉరకలేస్తున్నది. శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి లక్షా 40వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, 23 గేట్లను ఎత్తి లక్షా 39వేల క్యూసెక్కుల వరద నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు అందాలను తిలకించేందుకు వస్తున్న సందర్శకులు ఎలాంటి ప్రమాదాల భారిన పడకుండా అమరచింత పోలీసులు ఎస్సై జయన్న ఆధ్వర్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
కోయిల్‌సాగర్‌లో 22అడుగులు నిల్వ
దేవరకద్రరూరల్, జూలై 15: మండలంలోని కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి జూరాల నుంచి వరద నీరు చేరుతున్నది. శుక్రవారం సాయంత్రం వరకు 22అడుగుల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 32.6(2.27 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 22అడుగులు వద్ద ఉందన్నారు. నారాయణపేట, మద్దూర్, కోడంగల్ మండలాలకు తాగునీటి అవసరాలకు 10క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు పేర్కొన్నారు.
శ్రీశైలానికి పెరుగుతున్న వరద
శ్రీశైలం, జూలై 15: శ్రీశైల జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతున్నది. కృష్ణానదీ తీరప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల జలాశయంలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. శుక్రవారం రాత్రి జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి 1,00,696 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 35,807 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,41,815 క్యూసెక్కుల నీరు (మొత్తం 2,78,318 క్యూసెక్కుల నీరు) విడుదల కాగా రాత్రికి 2,45,335క్యూసెక్కులకు పైగా జలాశయానికి నీరు వచ్చి చేరుకున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 843.60 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215టీఎంసీలుకాగా ప్రస్తుతం 67.5543 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. టీఎస్ పవర్‌హౌస్‌లో విద్యుదుత్పత్తిని ప్రారంభించి 31,784 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.