మహబూబ్‌నగర్‌రూరల్ జూలై 15: ఇంజినీరింగ్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదువుతున్న యువతకు ఉపాధిపై శిక్షణ ఇస్తున్నట్లు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జి (టాస్క్) సీఈవో శ్రీకాంత్ సిన్వా, డైరెక్టర్ భాస్కర్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారితో సమావేశమయ్యారు. రాష్ట్రంలో టాస్క్ సంస్థ ద్వారా విద్యార్థులకు ఉపాధి అవకాశాలకు సంబంధించిన శిక్షణ ఇస్తున్నామని శ్రీకాంత్ సిన్వా తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని 32కళాశాలల్లోని 7,600 మంది విద్యార్థులకు టాస్క్, అనుబంధ సంస్థ ద్వారా ఉపాధి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ధేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న కొంత మంది వివిధ కంపెనీల్లో నియమాకాలు పొందారన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో 400ఎకరాల్లో సుమారు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఐటీ టవర్ ఆఫీస్‌ను కేటాయించామన్నారు. ఈ శిక్షణ కేంద్రాన్ని అక్టోబర్‌లో ప్రారంభించేలా చర్యలు తీనుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు చెందిన నిరుద్యోగులకు శిక్షణ ఇస్తామన్నారు. యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సవ్యసాచిఘోష్, డైరెక్టర్, యువజన సర్వీసుల శాఖ, సెట్విన్ ఎండీలు, టాస్క్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు.
వీరన్నపేటను అభివృద్ధి చేస్తాం
మహబూబ్‌నగర్‌టౌన్, జూలై 15 : వీరన్నపేటను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఎక్సైజ్, క్రీడా శాఖ మం త్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లోని 30వ వార్డు వీరన్నపేట అంబాభవాని కమ్యూనిటీ హాల్ సమీపంలో రూ.35 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో వీరన్నపేట, టీడీగుట్ట తదితర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్ని వార్డులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. బైపాస్ రాకతో వీరన్నపేట న్యూసిటీలా అభివృద్ధి చెందుతుందన్నారు. హైస్కూల్, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు విడుదల చేశామన్నారు. వీరన్నపేటకు చెందిన సుమారు 300 మందికిపైగా డబుల్బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేశామన్నారు. సొంత స్థలాలు ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తుందన్నారు. అనంతరం టీడీగుట్ట ఆంజనేయస్వామి గుడి ఆవరణలో బోరుమోటారు, లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, మాజీ వైస్‌చైర్మన్ రాములు, ముడా చై ర్మన్ గంజి వెంకన్న, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, కౌన్సిలర్లు చెన్నవీరయ్య, రాము, కిశోర్, మునీర్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు రామలింగం,నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయింపు
మహబూబ్‌నగర్, జూలై 15 : జిల్లాకేంద్రంలోని కోయిలకొండ ఎక్స్‌రోడ్డు సమీపంలో ముదిరాజ్ సంఘం భవనానికి వెయ్యి గజాల స్థలాన్ని మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ కేటాయించారు. ప్రొసీడింగ్‌ను శుక్రవారం మంత్రి ఆ సంఘం నాయకులకు అందజేశారు. స్థలంతోపాటు రూ.10లక్షలు మంజూరు చేస్తామని, బోరు కూడా వేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు కేశవులు, పరమేశ్, సురేశ్, సత్యన్న, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
బూస్టర్ డోస్ టీకా ప్రారంభం
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 15: ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ టీకా వేసుకోవాలని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. అంబాభవాని కమ్యూనిటీ హా ల్ పక్కన ఉన్న దూద్ దవాఖానను మంత్రి తనిఖీ చేశా రు. వైద్యసేవలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్‌ను నియమించాలని స్థానికులు కోరగా వెంటనే వైద్యాధికారికి సూచించారు. అనంతరం కరోనా బూస్టర్ డోస్ టీకాను మంత్రి ప్రారంభించారు.