నవాబ్‌పేట, జూలై 15 : మండలంలోని యన్మన్గండ్ల పెద్దచెరువు తూము మరమ్మతుకు నోచుకోవడంలేదు. మూడేండ్ల నుంచి చెరువు తూముకు గండి పడి నీరు వృథా అవుతున్నా సంబంధిత అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. తూము మరమ్మతుకు ప్రభుత్వం రూ.7లక్షలు మంజూరు చేసినా సకాలంలో పనులు చేయించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. యన్మన్గండ్ల పెద్దచెరువు కింద సుమారు 250 ఎకరాల ఆయకట్టు ఉంది. చెరువులోకి పుష్కలంగా నీరు వస్తే నవాబ్‌పేట, యన్మన్గండ్ల, రుక్కంపల్లి గ్రా మాలకు చెందిన వందలాదిమంది రైతులు పంటలు పండించుకునేవారు. యన్మన్గం డ్ల పెద్దచెరువు తూముకు మూడేండ్ల కిందట గండి పడి ధ్వంసమైంది.
అప్పటినుంచి ప్రతి ఏడాది నీరు వృథాగా పోతున్నది. తూ ము వద్ద గండి ఏర్పడకుండా అధికారులు కంటితుడుపు చర్యలు చేపట్టారే తప్ప శాశ్వ త పరిష్కారానికి పనులు చేపట్టలేదు. కాగా, ఇటీవల ప్రభుత్వం కొత్త తూము నిర్మాణానికి రూ.7లక్షలు మంజూరు చేసింది. గత వేసవిలోనే పనులు చేపట్టాల్సి ఉన్నా ప్రారంభానికి నోచుకోలేదు. ఇటీవల ప్రారంభమైన మరమ్మతు పనులు వర్షాల కారణంగా నిలిచిపోయాయి. చెరువులోకి వర్షపునీరు ఎంత వచ్చినా వృథాగా బయటకు వెళ్లే ప్రమాదం ఉన్నది. ప్రస్తుత వర్షాకాలంలో చెరువుల అలుగులు, తూములు సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పదేపదే ఆదేశిస్తున్నా.. స్థానిక అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యవేక్షించాల్సిన నీటిపారుదల శాఖ అధికారులు చుట్టపుచూపుగా మారడంతో పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా సం బంధిత అధికారులు స్పందించి పెద్దచెరువు తూము నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైతు లు కోరుతున్నారు.
వర్షాలతో పనులు నిలిచిపోయాయి
యన్మన్గండ్ల పెద్దచెరువు తూముకు సంబంధించి గతనెలలోనే కాంట్రాక్టర్ పనులను ప్రారంభించారు. పనులు చేపట్టేలోగా వర్షాలు రావడంతో పనులను నిలిపివేయాల్సి వచ్చింది. వర్షాలు తగ్గిన వెంటనే పనులను ప్రారంభిస్తాం. త్వరగా పనులను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తాం.
– భాగ్యశ్రీ, ఇరిగేషన్ ఏఈ, నవాబ్‌పేట