శ్రీశైలం జలాశయానికి వరద పరవళ్లు తొక్కుతున్నది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జూరాల, సుంకేసుల గేట్లు ఎత్తి లక్షకుపైగా క్కూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ఎంజీకేఎల్ఐ అధికారులు మోటార్లను ప్రారంభించారు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో కాల్వలకు నీళ్లు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో భీమా ఫేజ్-1,2తో పాటు కోయిల్‌సాగర్ కుడి,ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేస్తున్నారు.
మహబూబ్‌నగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అయిజ/శ్రీశైలం/రాజోళి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులు ఉప్పొంగుతున్నాయి. కర్ణాటకలో కృష్ణ, తుంగభద్ర బేసిన్లో అన్ని ప్రాజెక్టులు నిండటంతో భారీ ఎత్తున వరద జూ రాల, సుంకేసులకు చేరుతున్నది. బుధవారం సా యంత్రం జూరాల ప్రాజెక్టులు గేట్లు ఎత్తిన అధికారులు గురువారం సుంకేసుల జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో శ్రీశైలం వైపు రెండు నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. కర్ణాటకలోని నారాయణపూర్ డ్యాం నుంచి 1,43,500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో జూరాలకు వస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు 23 గేట్లు ఎత్తి 1,13,005 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
విద్యుత్ ఉత్పత్తితో పాటు కుడి, ఎడమ, సమాంతర కాలువలకు సాగునీటిని విడుదల చేస్తున్నారు.
తుంగభద్ర డ్యాంలో 30 గేట్ల ఎత్తివేత..
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు వరద కొనసాగుతున్నది. ఎగువన కురుస్తున్న వర్షాలకు టీబీ డ్యాంకు వరద నీరు భారీగా చేరుతుండటంతో 30గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. 10గేట్లు రెండున్నర అడుగు లు, 20 గేట్లు నాలుగు అడుగులు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం టీబీ డ్యాంలోకి ఇన్‌ఫ్లో 1,45, 730 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 1,48,404 క్యూసెక్కులుగా ఉంది. 105.788 టీఎంసీల సామ ర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం పూర్తిస్థాయి నీటిమట్టం 97.677 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 1633 అడుగుల నీటి మట్టానికిగానూ, 1630.5 అడుగులు ఉన్నట్లు టీబీ డ్యాం ఎస్ఈ శ్రీకాంత్‌రెడ్డి, సెక్షన్ అధికారి విశ్వనాథ్ తెలిపారు. టీబీ డ్యాం నుంచి దిగువకూ ఉరకలేస్తూ శ్రీశైలం వైపునకు పరుగులు పెడుతోంది.
ఆర్డీఎస్ ఆనకట్టకు..
కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం ఆర్డీఎస్ ఆనకట్టకు 1,03,800 క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా, అవుట్ ఫ్లో 1,03,600 క్యూసెక్కుల వరద నీరు సుంకేసుల బ్యారేజీకి చేరుతోందని కర్ణాటక ఆర్డీఎస్ ఏఈ శ్రీనివాస్ తెలిపారు. 200 క్యూసెక్కులు ఆర్డీఎస్ ఆయకట్టుకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆనకట్టలో ప్రస్తుతం 13 అడుగుల మేరకు నీటి మట్టం ఉందని తెలిపారు. వరద నీటి చేరికతో ఆర్డీఎస్ ఆనకట్టకు జలకళ సంతరించుకున్నది.
సుంకేసుల బ్యారేజ్‌కు జలకళ..
తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన సుంకేసుల బ్యారేజ్‌కు జలకళ సంతరించుకుంది. వారం రోజులుగా నిరంతర వర్షాలకు టీబీ డ్యాం నుంచి వరద తాకిడితో సుంకేసుల డ్యాం నుంచి నీటిని విడుదల చేశారు. ఎగువ నుం చి 37,961క్యూసెక్కులు రాగా 10 గేట్లు మీటర్ మేర ఎత్తి దిగువకు 37,630 క్యూసెక్కులు వదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 0.782 టీఎంసీల నీటిమట్టానికిగానూ 0.554గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
831అడుగులకు శ్రీశైలం డ్యాం
శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వచ్చి చేరుతున్నది. కృష్ణా నదీ తీరప్రాంతా ల్లో కురుస్తున్న వర్షాల వల్ల జలాశయంలో నీటిమట్టం పెరుగుతున్నది. గురువారం జూరాల ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల నుంచి 1,13,005 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 33,794 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 60,208 క్యూసెక్కులు విడుదల కాగా సాయంత్రానికి లక్ష క్యూసెక్కులకు పైగా జలాశయానికి వరద నీరు వచ్చి చేరుకున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 832.80 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 52.516 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది.
ఎంజీకేఎల్ఐ మోటార్లు ప్రారంభం
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణ, తుంగభద్ర నదులు ఉప్పొంగుతున్నాయి. కర్ణాటకలో కృష్ణ, తుంగభద్ర బేసిన్లో అన్ని ప్రాజెక్టులు నిండటంతో భారీ ఎత్తున వరద జూరాల, సుంకేసులకు చేరింది. దీంతో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను అధికారులు ప్రారంభించి ఆయా రిజర్వాయర్లకు, కాలువలకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్న నేపథ్యంలో కాల్వలకు నీళ్లు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో భీమా ఫేజ్ 1,2తో పాటు కోయిల్‌సాగర్, కుడి ఎడమ కాల్వలకు భారీగా నీరు విడుదల చేస్తున్నారు. మరోవైపు ఆరుయూనిట్ల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.
పర్యాటకుల సందడి
జూరాల గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి మొదలైంది. ఈ మేరకు ప్రాజెక్టు వద్ద ఇరిగేషన్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్నానాల కోసం, సెల్ఫీల కోసం నదిలో దిగొద్దని హెచ్చరిస్తున్నారు.