మహబూబ్‌నగర్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నాయి. ఈ క్రమంలో సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మలేరియా, డెంగీ, ఇతర విషజ్వరాలు ప్రబలకుండా జా గ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల జోగుళాంబ గద్వాల జిల్లా కేం ద్రంలో అతిసార ప్రబలి నలుగురు చనిపోయారు. ఈ ఘటనతో తరుకున్న ఉమ్మడి జిల్లా అధికారులు వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. తాసిల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. మురుగునీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. మున్సిపాలిటీల్లో నాలాలు, లోతట్టు ప్రాంతాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. మండలస్థాయి అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఆయా జిల్లా దవాఖాల్లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఏరియా దవాఖానలు, పీహెచ్‌సీల్లో 24 గంటలపాటు వైద్య సేవలందిస్తున్నారు. అన్ని రకాల మందు లు అందుబాటులో ఉంచారు. నల్లమల అటవీప్రాంతంలో ఉన్న చెంచుపెంటల్లో కూడా ప్రత్యేక వైద్య సదుపాయలు అందిస్తున్నారు.
నేటి నుంచి ఫీవర్‌సర్వే..
గద్వాల, జూలై 14 : జిల్లా దవాఖనలో సీజనల్ వ్యాధులతో సుమారు 20 మంది వరకు చికిత్స పొందుతున్నారు. రోగులకు వైద్యులు నిరంతర వైద్యసేవలందిస్తున్నారు. ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సి న జాగ్రత్తలపై కలెక్టర్ శ్రీహర్ష మున్సిపల్ కమిషనర్లతో సమావేశమై పలు సూ చనలు, సలహాలు ఇచ్చారు. కాగా, శుక్రవారం నుంచి గద్వాల మున్సిపాలిటీలో ఆశ, ఆరోగ్య, రిసోర్స్ పర్సన్లు ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వే చేయనున్నారు. వైద్య సిబ్బందితోపాటు మున్సిపల్ సిబ్బంది కూడా ఇంటింటికీ వెళ్లి జ్వరం, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిని గుర్తించి ప్రభుత్వ దవాఖానకు తరలించేలా చర్యలు తీసుకోనున్నారు. వారం కిందట మున్సిపాలిట్టీలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని అధికారులు అప్రమత్తమయ్యారు.
సీజనల్‌పై అప్రమత్తం..
నాగర్‌కర్నూల్, జూలై 14 (నమస్తే తెలంగాణ) : వర్షాలతో ప్రజలు సీజనల్ రోగాలకు గురవుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటించాలని వైద్యారో గ్య శాఖ అవగాహన కల్పిస్తున్నది. ఇండ్లల్లో దోమతెరలు వాడడంతోపాటు సాయంత్రం వేళల్లో తలుపులు, కిటికీలు మూసి ఉంచాలని సూచిస్తున్నా రు. దోమలను లార్వా దశలోనే చంపేలా ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. డెం గీ, మలేరియా, చికున్‌గున్యా, టైఫాయిడ్ వంటి కేసులు ఒక్క అంకెకే పరిమితమవడం గమనార్హం. ఈ ఏడాది మలేరియా, చికున్‌గున్యా కేసులు ఒ క్కటి కూడా నమోదు కాలేదు. అయితే చెంచుపెంటలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అమ్రాబాద్ పరిధిలోని చెంచు పెంటల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ వారాంతంలో క్యాంపులు ప్రారంభం కానున్నాయి. మన్ననూరు పీహెచ్సీలో ఐటీడీఏ ద్వారా డయాగ్నొస్టిక్ హబ్ ఏర్పాటుకు కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఇటీవలే పరిశీలించారు. ఇది పూర్తయితే చెంచులకు సీజనల్ వ్యాధులతోపాటు 23 రకాల వ్యాధులకు పరీక్షలు ఉచితంగా చేయనున్నారు.
జాగ్రత్తలు పాటించాలి..
వనపర్తి రూరల్, జూలై 14 : సీజనల్ వ్యాధులపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో ముమ్మరంగా చర్యలు చేపట్టినట్లు డీఎంహెచ్‌వో రవిశంకర్ తెలిపారు. వానకాలంలో సాధారణంగా డయేరియా వ్యాపిస్తుందన్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. గ్రామాలు, పట్టణాలలో ఇంటింటి సర్వే చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో సాధారణ డయేరియా కేసులు 385, థైరాయిడ్ కేసులు 46, ఫీవర్ 711, కుక్కకాటు 122, స్నేక్ బైట్ 6 కేసులు నమోదయ్యాయన్నారు. డెంగీ, చికున్‌గున్యా, మలేరియా వంటి కేసులు ఇప్పటివరకు ఒక్కటి కూడా నమోదు కాలేదన్నారు. గ్రామాల్లో ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లకు సీజనల్ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. ఈగలు, దోమల నివారణకు గ్రామాల్లో ఫాగింగ్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
ప్రజల సహకారం ఉండాలి..
ప్రతి వానకాలంలో సీజనల్ రోగాలు వస్తాయి. ప్రభుత్వం, వైద్య శాఖల ద్వారా చేపట్టే చర్యలతోపాటు ప్రజల సహకారం కూడా ఉండాలి. వైద్యశాఖ ద్వారా ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహిస్తున్నాం. మన్ననూరులో చెంచుల కోసం డయాగ్నొస్టిక్ కేంద్రం నిర్మిస్తున్నాం. త్వరలో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. వానకాలంలో పూర్తిగా ఉడికిన, వేడి ఆహార పదార్థాలను భుజించాలి. రోడ్లపై అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాల్లోని చిరుతిండ్లు, ఆహారాలకు దూరంగా ఉండడం మేలు. పల్లె, పట్టణ ప్రగతితో సీజనల్ రోగాలు చాలా వరకు దూరమయ్యాయి. దోమల నియంత్రణ చర్యలు తీసుకోవాలి. – సుధాకర్లాల్, డీఎంహెచ్‌వో, నాగర్‌కర్నూల్
అవగాహన కల్పిస్తున్నాం..
సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. వ్యాధుల కట్టడికి చర్యలు చేపడుతున్నాం. వైరల్ ఫీవర్ అధికంగా వస్తున్న గ్రామాలు, కాలనీల్లో ప్రత్యేకంగా రక్తనమునాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాం. పీహెచ్సీలో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. కలుషితమైన నీరు తాగడం, ఆహారం తినడం వల్ల సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలి. కాచి చల్లార్చిన నీటినే తాగాలి. విషజ్వరాల బారినపడితే ప్రభుత్వ దవాఖానల్లో చేరాలి. – డాక్టర్ కృష్ణ, డీఎంహెచ్‌వో, మహబూబ్‌నగర్
వైద్యారోగ్య శాఖ సమరం..
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, జూలై 14 : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నీటి, కీటక జనిత వ్యాధులు ప్రబలుతున్నాయి. ఏటా డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గున్యా విషజ్వరాలు జిల్లావాసులను వణికిస్తున్నాయి. జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానలో సీజనల్ రోగుల సంఖ్య పెరిగింది. సాధారణ రోజుల్లో రోజుకు 1400 ఓపీ ఉంటే ప్రస్తుతం 2 వేలకు చేరుకున్నది. ఇందులో చాలా వరకు వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న వారే ఉన్నారు. సాధారణ రోజుల్లో 400 నుంచి 500 వరకు అడ్మిట్ కేసులుంటే.. వారం రోజులుగా 700 నుంచి 800 కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది 2,70,022 మందికి అన్ని రకాల రక్త పరీక్షలు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రంలోని వీరన్నపేట, రామయ్యబౌళి, పాతపాలమూరు. శివశక్తినగర్, మోతీనగర్, షాషాబ్‌గుట్ట, బీకే రెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, ప్రేమ్‌నగర్ ప్రాంతాల్లో విషజ్వరాల ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఆ తర్వాత జడ్చర్ల, భూత్పూర్ నిలిచాయి. కాగా, సీజనల్ వ్యాధులపై వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. గ్రామాల్లో వ్యాధుల నివారణపై అవగాహన కల్పించడంతోపాటు దోమ తెరల పంపిణీకి సిద్ధమైంది. మలేరియా ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ఇంటింటికీ దోమ తెరలు అందించనున్నారు.
రెండు నెలల్లో 2,330 జ్వరాలు..
గతేడాది జిల్లాలో 5,555 మందికి విషజ్వరాలు సోకినట్లు అధికారిక లెక్కలు ఉ న్నాయి. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లోనే 2,330 మందికి జ్వరాలు సోకినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జూన్, జూలై నెలలో 1775 మందికి అతిసార సో కగా, ఐదుగురికి మలేరియా, 55 మందికి డెంగీ, 9 మందికి టైఫాయిడ్ వచ్చింది.