ఊట్కూర్, జూలై 7: ప్రభుత్వ భూముల ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవని నారాయణపేట ఆర్డీవో రాంచందర్ హెచ్చరించారు. గురువారం ఊట్కూర్ శివారులోని 689, 820 సర్వే నెంబర్లలో ఉన్న వక్ఫ్ భూములను పరిశీలించి అక్రమంగా నిర్మిస్తున్న షెడ్డు నిర్మాణం పనులను అడ్డుకున్నారు. వక్ఫ్ భూమిలో స్థానికంగా ఓ రైతు కట్టెల మిషన్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడంతో విషయం తెలుసుకున్న ఆర్డీవో తాసిల్దార్ తిరుపతయ్యతో కలిసి భూములను పర్యవేక్షించారు. చెక్‌పోస్టు సమీపంలోని వక్ఫ్ భూమిలో షెడ్డు నిర్మాణం కోసం అక్రమంగా పాతిన పైపులను సిబ్బందిచే తొలగింపజేశారు.
ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూముల్లో అధికారుల అనుమతి లేనిదే ఎలాంటి కార్యకలాపాలు చేపట్టరాదని సూచించారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయాన్ని తనిఖీ నిర్వహించి రికార్డులను పరిశీలించారు. కార్యాలయం ఆవరణలో పచ్చదనం పెంచేందుకు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్రారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.