Winter Olympics | ఇటలీ వేదికగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ఇప్పుడు పతకాల వేట కంటే మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. క్రీడా గ్రామంలో అథ్లెట్ల కోసం ఏర్పాటు చేసిన కండోమ్స్ నిండుకోవడంతో నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. ఊహించిన దానికంటే ముందే స్టాక్ ‘క్లీన్ స్వీప్’ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అసలేం జరిగింది?
సాధారణంగా ఒలింపిక్ క్రీడల్లో అథ్లెట్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా నిర్వాహకులు ఉచితంగా కండోమ్స్‌ను పంపిణీ చేస్తుంటారు. ఈ వింటర్ ఒలింపిక్స్ కోసం దాదాపు 10,000 కండోమ్స్‌ను అందుబాటులో ఉంచారు. అయితే, ఆటలు మొదలైన కేవలం మూడు రోజుల్లోనే ఆ స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది. సుమారు 90 దేశాల నుంచి వచ్చిన 2900 మంది అథ్లెట్లు ఈ క్రీడా గ్రామంలో ఉంటున్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో లక్షల సంఖ్యలో పంపిణీ చేసినా రాని ఇబ్బంది, ఇక్కడ మాత్రం కేవలం మూడు రోజుల్లోనే ఎదురైంది. బయట మైనస్ డిగ్రీల చలి ఉండటంతో, అథ్లెట్లు ‘వేడి’ కోసం ఇండోర్ యాక్టివిటీస్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు చమత్కరిస్తున్నారు. మరోవైపు స్టాక్ అయిపోవడంతో ఇప్పుడు హుటాహుటిన కొత్త స్టాక్ తెప్పించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గతంలో జరిగిన వేసవి ఒలింపిక్స్‌లో అంచనాలకు తగ్గట్టుగా ఏర్పాట్లు ఉండేవి. కానీ వింటర్ ఒలింపిక్స్‌లో మాత్రం అథ్లెట్ల ఉత్సాహం నిర్వాహకుల అంచనాలను మించిపోయింది. “మంచు కంటే ముందే స్టాక్ ఫ్రీజ్ అయిపోయింది” అంటూ క్రీడా వర్గాల్లో జోకులు పేలుతున్నాయి.