నాగర్‌కర్నూల్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెరగనున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. దీంతో గ్రామాల్లో సమస్య ల పరిష్కారానికి ఎదురుచూస్తున్న ప్రజలకు, హామీలు ఇచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఊరట లభించనున్నది. ఫలితంగా ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి పనుల్లో మరింత పురోగతి కనిపించనున్నది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల విడుదలతో గ్రా మాల్లో కొత్త అభివృద్ధి పనులకు బాటలు పరుచుకోనున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో గ్రా మాలు, పట్టణాల్లో సమస్యలకు పరిష్కారం లభించనున్నది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభివృద్ధి పనులపై హామీ లు ఇచ్చారు. వాటిని నెరవేర్చేందుకు తమ నిధుల కోసం ప్రజాప్రతినిధులు ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం నిధుల మంజూరుకు అనుమతించింది. ఒక్కో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకి అభివృద్ధి నిధుల కింద సీడీపీ నిధులు విడుదలవుతున్నాయి. 2021 కంటే ముందు ఏడాదికి రూ.3 కోట్ల నిధు లు ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం 2021-2022 నుంచి రూ.5 కోట్లను కేటాయిస్తున్నది. ఇందులో రూ.2 కోట్లు మనఊరు-మన బడి కింద ఎంపిక చేసిన పాఠశాలల్లో భవనాలు, కిచెన్ షెడ్లు, బాత్రూంలు, ఫర్నిచర్, డిజిటల్ తరగతుల నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. మిగిలిన రూ.3 కోట్లతో సాధారణ అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. అయితే ఈ నిధుల్లో 50 శాతం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. దీని ప్రకారం ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రూ.1.50 కోట్లను అభివృద్ధి పనులకు కేటాయించనున్నారు. ఇందులో 10 శా తంగా రూ.30 లక్షలు తెలంగాణ గ్రీన్ ఫండ్ కిందికి వర్తిస్తుంది.
హరితహారంలో భాగంగా ప్రతి వ్యాపార సంస్థలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి ప్రభుత్వం హరితనిధి కింద వసూలు చేస్తున్నది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుంచి కూడా కేటాయించనుండడం గమనార్హం. వీటితో పా ర్కుల ఏర్పాటు, అటవీ విస్తీర్ణం, పచ్చదనం పెంపునకు వి నియోగించనున్నారు. ఇలా తొలి విడుతలో చేపట్టిన పనులు పూర్తయ్యాక.. మరో విడుతగా రూ.1.50 కోట్లు విడుదల చేయ నున్నది. జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించనుండడం గమనార్హం. ఎస్సీ నిధులను దళిత వాడల్లో, ఎస్టీ నిధులను తండాల్లో, జనరల్ నిధులను మిగిలిన ప్రాంతాల్లోని పనులు చేపట్టేందుకు వెచ్చించనున్నారు. నిధులు మంజూరవడంపై ఎ మ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో సమైక్యపాలనకంటే భిన్నంగా ఎమ్మెల్యేలు వారంలో మూడు, నాలుగు రోజులు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ అభివృద్ధి పను ల్లో మమేకం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి వ చ్చే సమస్యలను స్వీకరించి పరిష్కారానికి హామీలు ఇస్తున్నా రు. అలాంటి నేపథ్యంలో ఈ నిధులతో సీసీ రోడ్లు, తాగునీటి బోర్లు, టాయ్లెట్లు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాలు, అంగన్వాడీలు, ఆరోగ్య ఉపకేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు, బస్టాండ్లు వంటి 98 రకాల పనులు చేపట్టేందుకు ప్రజాప్రతినిధులకు ఊరట కల్పించనున్నది. అయితే, ఈ నిధులను ఖర్చు చేస్తేనే మిగిలిన రూ.1.50 కోట్లు మంజూరవుతాయి. ఈ నిధుల వినియోగంలో మంత్రి ఆమోదం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కలెక్టర్ల ఆమోదంతోనే చేపట్టనుండగా ఈసారి మంత్రులు కీలకంగా మారనున్నారు. మొత్తమ్మీద సీడీపీ నిధుల విడుదల ప్రజాప్రతినిధులకు అభివృద్ధి పనులు చేపట్టేందుకు మరింత ఉత్సాహాన్ని కల్పించనున్నది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని నలుగురు ఎమ్మెల్యేలకు రూ.1.50 కోట్ల కింద రూ.6 కోట్లు, ఎమ్మెల్సీలు కూచకుళ్ల దా మోదర్‌రెడ్డి, కశిరెడ్డి నారాయణరెడ్డి, గోరటి వెంకన్నకు రూ. 1.50 కోట్ల చొప్పున రూ.4.50 కోట్లు కలిపి.. మొత్తం జిల్లాకు రూ.10.50కోట్లు మంజూరవడం విశేషం.
అభివృద్ధి పనుల్లో వేగం..
సీడీపీ నిధుల మంజూరుతో ఇప్పటికే జరుగుతున్న, చేపట్టబోయే పనుల్లో వేగం పుంజుకుంటుంది. ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నది. సీడీపీ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి బల్బులు, కమ్యూనిటీ హాళ్లు తదితర పనులకు కేటాయించేందుకు కార్యాచరణ రూపొందించాం. సీఎం కేసీఆర్ సహకారంతో ప్రతి గ్రామం, పట్టణం అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి.
– మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే, నాగర్‌కర్నూల్