అచ్చంపేట, జూన్ 17 : రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల వికాసానికి పెద్దపీట వేసిందని గిరిజన, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలో విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతితో కలిసి పలు అభివృద్ధి పనులకు హాజరయ్యారు. ఎన్టీఆర్ స్టేడియంలో 43 మంది దళితబంధు పథకం లబ్ధిదారులకు ట్రాక్టర్లు, ఐదు కార్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితబంధు కింద నియోజకవర్గంలో వంద మంది లబ్ధి పొందడం సంతోషంగా ఉందన్నారు. దళితుల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అమ్మఒడి, కేసీఆర్ కిట్ వంటి పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అచ్చంపేటలోని ఐనోలు గ్రామంలో నూతనంగా నిర్మించిన బాలికల గురుకుల పాఠశాలను ఇంటర్గా అప్గ్రేడ్ చేయడంతోపాటు అదనపు భవనానికి రూ.4 కోట్లు మంజూరు చేస్తానన్నారు. పాఠశాల కంపౌండ్, ఇతర వసతుల కల్పనకు రూ.కోటి ఇస్తానని, తండాల్లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణాల కోసం రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు.
చెంచుల ఆవాసాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం బడ్జెట్లో వెయ్యి కోట్లు కేటాయించిందని, మారుమూల, గిరిజనులు అధికంగా ఉన్న అచ్చంపేట ప్రాంతానికి ఎక్కువ నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. గిరిజన ఆవాపాలు, తండాలకు రహదారుల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపిస్తే మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తానన్నారు. గిరిజన పూజారులకు దూప, దీప నైవేద్యం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆలయాలకు వర్తింపజేస్తామన్నారు. మద్దిమడుగు ఆలయంలో గిరిజన సత్రం నిర్మాణానికి సహకారం ఉంటుందన్నారు. గిరిజన, శిశు సంక్షేమ శాఖల నుంచి కావాల్సిన నిధులపై దృష్టి సారిస్తానన్నారు. అనంతరం జీబీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోచింగ్ సెంటర్ను సందర్శించి మాట్లాడారు. విప్ గువ్వల ఎంతో ఖర్చుతో కోచింగ్ ఇప్పించడం, మెటీరియల్, భోజన వసతి కల్పించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్లో అచ్చంపేట యువత అధిక సంఖ్యలో ఉద్యోగాలు సాధించి ఎమ్మెల్యేకు రిటన్ గిఫ్ట్ ఇవ్వాలని కోరారు. అనంతరం విప్ గువ్వల, ఎంపీ రాములు మాట్లాడుతూ తొందరలోనే అచ్చంపేట నియోజకవర్గంలో మరో 1500 మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి లబ్ధి చేకూరేవరకు ఈ పథకం కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఆర్డీవో పాండునాయక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎంరెడ్డి, మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్ పాల్గొన్నారు.