జడ్చర్లటౌన్, జూన్ 7: పోషక విలువలు కలిగిన ఆహారంతోనే ఆరోగ్యవంతంగా ఉంటారని జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ అన్నారు. ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక డిగ్రీ కళాశాలలో మంగళవారం మహిళా సాధికారత విభాగం, వృక్షశాస్త్ర విభాగం, ఎకోక్లబ్, ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా ఆహార భద్రతపై అవగాహన, ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ పూర్వీకులు పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోవటంతో ఆరోగ్యవంతంగా ఉండేవారన్నారు. ప్రస్తుతం రసాయన ఎరువుల వాడకం, సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. పోషక విలువలున్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారని సూచించారు. మొలకలు, పీచు పదార్థాలు, తాజా పండ్లు, ఆకుకూరలు, తేనే, గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యకరమైన పదార్థాలను ప్రదర్శించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధ్యాపకులు ఎన్ సుభాషిణి, భార్గవిలత, రమాదేవి, కవిత, మాధవిలత, విఠల్, బాలరాజు, శ్రీను, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.