కేటీదొడ్డి, జూన్ 2 : డ్రైవర్ నిర్లక్ష్యంగా డీసీఎంను నడపడం వల్ల గొర్రెలు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండల కేంద్రాని కి సమీపంలో చోటు చేసుకున్నది. ఎస్సై కురుమయ్య కథనం మేరకు.. మండలంలోని నందిన్నె గ్రామానికి చెందిన కుర్వ రాములు 400 గొర్రెలను కాపరులతో కలిసి మేపడానికి జూరాల ప్రాజెక్టు కింద పొలాల వద్దకు బయలుదేరాడు.
గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో గువ్వలదిన్నె గ్రామ స్టేజీ వద్దకు మంద రాగానే ఎదురుగా వచ్చిన డీసీఎం (టీఎస్ 32 టీ 1445) గొర్రెలపై దూసుకొచ్చింది. దీంతో 55 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా.. 33 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. రూ.లక్షల్లో నష్టం వాటిల్లడంతో గొర్రెల యజమాని లబోదిబోమంటున్నాడు. మృతి చెందిన గొర్రెలకు మండల పశువైద్యాధికారి వినయ్ కుమార్ పోస్టుమార్టం నిర్వహించారు. రా ములును జెడ్పీటీసీ రాజశేఖర్, ఎస్సై కురుమయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఉరుకుందు, తాసిల్దార్ సుందర్రాజు పరామర్శించారు.