అభివృద్ధి, సంక్షేమం పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, కలెక్టర్ హరిచందన, జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని గురువారం జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. వాడవాడలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను సంబురంగా నిర్వహించారు. అలా గే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గ్రామ పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్ర అవతరణ వేడుకలను కనులపండువగా నిర్వహించారు. అంతకుముందు అమరవీరుల చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. జై జై కేసీఆర్, జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. అమరుల ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా నిలవాలన్నారు. అనంతరం క్రీడా ప్రాంగణాలు, పోటీలు ప్రారంభించారు. గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యేలు మొక్కలు నాటారు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 2