మహబూబ్‌నగర్, నవంబర్ 8 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : గ్రామీణ ప్రాంతాల ప్రజలను కంటికి రెప్పలా కాపాడాలని.. ఎలాంటి ఆరోగ్య సమస్యనైనా పరిష్కరించేందుకుగానూ మహబూబ్‌నగర్ జిల్లాలో వ యోవృద్ధులకు ఉచిత హెల్త్ క్యాంపులు నిర్వహించేలా వైద్యశాఖాధికారులు కసరత్తు చేస్తున్నారు. పర్యాటక, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా తొలి దశలో హెల్త్ క్యాంపులు చేపడుతున్నారు. గ్రామాల్లో చా లా మంది వయోవృద్ధులు చిన్నచిన్న జ బ్బులతో బాధపడుతున్నట్లు మంత్రి గ మనించారు. దీంతో ప్రభుత్వం తరఫున ఉచితంగా వైద్య శిబిరాలు ఏ ర్పాటు చేసి వైద్యులతో పరీక్షలు చేయించనున్నారు.
ఏదైనా మేజర్ సమస్య ఉంటే వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించి.. ఉచితంగా వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హెల్త్ క్యాంపులకు సంబంధించి వైద్యశాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. మంత్రి అనుమతి రాగానే.. వారంలోగా వైద్య శిబిరాలను నిర్వహించాలని భావిస్తున్నారు. ఇది విజయవంతమైతే జిల్లా వ్యాప్తంగా క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. గతంలో కంటివెలుగు కింద వేలాది మంది లబ్ధి పొందారు. అదే తరహాలో గ్రామాలకు వెళ్లి శిబిరాలు నిర్వహించాలని భావిస్తుండడంతో.. ఎంతో మందికి ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
మంత్రి ఆదేశాలతో వైద్య శిబిరాలు..
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని వయోవృద్ధులు ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడకూడదన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆలోచనతో వైద్యశిబిరాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం తరఫున ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. దీంతో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారులు హెల్త్ క్యాంపుల నిర్వహణకు నడుం బిగిస్తున్నారు. శిబిరాలు నిర్వహించే తేదీలను ముందుగానే గ్రామాల్లో ప్రకటించనున్నా రు. బీపీ, షుగర్, బ్లడ్ గ్రూప్, ఇతర చిన్న చిన్న పరీక్షలు నిర్వహించి వృద్ధుల హెల్త్ ప్రొఫైల్‌ను తయారు చేసి.. అవసరం ఉ న్నవారికి మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలోని టీహబ్‌లో ఉచితంగా పరీక్షలు చేయనున్నారు.
ఎమ్మారై, సీటీ స్కాన్, ఈసీ జీ, మూత్రం, రక్త పరీక్షలతోపాటు 64 రకాల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షల్లో ఏమైనా ఆరోగ్య సమస్య తేలితే డాక్టర్లను సంప్రదించి నిర్ణయం తీసుకుంటారు. అవసరం ఉన్నవారికి ఆపరేషన్లను చేయించాలని.., రానుపోను ఖర్చులు కూడా వైద్య, ఆరోగ్య శాఖనే భరించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా దవాఖానలో అంబులెన్స్‌లు, 104 వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ వినియోగించుకోనున్నారు. ట్యాబెట్ల ద్వారా నయమయ్యే వారికి ఉచితంగా మందులు ఇవ్వనున్నారు. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలుంటే సమీప పీహెచ్‌సీల్లోనే చికిత్సలు అందించనున్నారు.
మోకాళ్ల నొప్పులు, కంటి సమస్యలే అధికం..
గ్రామీణ ప్రాంతాల్లోని చాలా మందికి మోకాళ్ల నొప్పులు, కంటి సమస్యలే అధికంగా ఉంటాయని వైద్యలు భావిస్తున్నారు. పంటపొలాల్లో పనిచేయడం వల్ల చాలా మంది ఆరోగ్యంగా ఉండనున్నారు. అయితే, వయస్సు పైబడడంతో వచ్చే ఆరోగ్య సమస్యలే అధికంగా ఉంటున్నాయి. దవాఖానకు వెళ్లి చూయించుకునే ఆర్థికస్థోమత లేక చాలా మంది అలాగే ఉంటునన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచించడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాగా, మహబూబ్‌నగర్ దవాఖానలో మోకాళ్ల శస్త్ర చికిత్సలను కూడా ఉచితంగా చేపడుతున్నారు. ఇప్పటివరకు సుమారు 15 మందికి విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు.
ఏర్పాట్లు చేపడుతున్నాం..
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచన మేరకు మహబూబ్‌నగర్ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నాం. ఇందుకుగానూ అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం. ఒకటి, రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందనున్నది. మంత్రి ఆదేశాలు వచ్చిన వెంటనేశిబిరాలు ఏర్పాటు చేస్తాం. వచ్చేవారం నుంచి క్యాంపులు నిర్వహించాలని భావిస్తున్నాం. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఉచితంగానే వైద్య సేవలందిస్తాం.
– డా.శశికాంత్, డీఎంహెచ్‌వో, మహబూబ్‌నగర్