అమ్మాపూర్ సమీంలోని సప్తగిరులపై ఉన్న కాంచనగుహ స్వర్ణకాంతులతో ధగధగలాడింది. భక్తుల ఆరాధ్యదైవం.. కొలిచిన వారికి కొంగుబంగారం.. పేదల తిరుపతిగా పేరొందిన కురుమూర్తి రాయుడికి అలంకారోత్సవం కనులపండువగా సాగింది. బ్రహ్మోత్సవాల్లో రెండో పెద్ద ఘట్టంలో భాగంగా ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంక్ లాకర్లో ఉన్న స్వామి స్వర్ణాభరణాలకు గాడి వంశస్తులు, ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి తోపాటు ప్రముఖులు పూజలు చేశారు. అలాగే అమరచింత పద్మశాలీలు నేచిన పట్టువస్ర్తాలను సైతం భాజాభజంత్రీలు, డీజేల హోరు.. పటాకుల మోతల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లారు. భక్తజనుల సందడి మధ్య ప్రత్యేక ఎస్కార్ట్ కాన్వాయ్ ఊరేగింపు ఆధ్యంతం ఆనందభరితంగా జరిగింది. దారి పొడవునా భక్తులు ఆభరణాలను మొక్కేందుకు పోటీపడ్డారు. ముక్కెర, నంబి వంశస్తులు ఆభరణాలను కొండపైకి చేర్చారు. అనంతరం స్వామికి అలంకరించగా భక్తులు తన్మయత్వం చెందారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన ఉద్దాలోత్సవం సోమవారం జరగనుండగా.. ఏర్పాట్లు చేశారు.

దేవరకద్ర రూరల్, అక్టోబర్ 30: పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం వరకు స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారికి స్వర్ణాభరణాల్లో పొదిగిన వజ్ర వైడుర్యాలతో కూడిన ఆభరణాలను అలంకరణ చేయడంతో స్వామివారు బంగారు కురుమతిరాయుడితో పాటు అమ్మవారు దర్శనభాగ్యం కల్పించారు. అమ్మాపూర్ సంస్థానాధీశులైన శ్రీరాంభూపాల్ గారి బంగ్లాలో స్వామి వారి ఆభరణాలు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి కురుమూర్తి కొండల్లోని స్వామి ఆలయానికి తీసుకొచ్చే సమయంలో గ్రామంలో భక్తులు ఆభరణాల దర్శనం చేసుకుని పరవశించిపోయారు.
ఆభరణాలను అర్చకులు సంప్రోక్షణలు చేసి స్వామివారికి, అమ్మవారికి అలంకరించారు. కాంచనగుహ స్వర్ణకాంతులతో ధగధగలాడింది. అలంకరణ అనంతరం ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీచైర్‌పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అంతకు ముందు అప్పంపల్లి గ్రామానికి చెందిన కుమ్మరులు తయారు చేసిన తలియకుండ పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్‌రాజు కార్యనిర్వహణ అధికారి శ్యాంసుందరాచారి, తాసిల్దార్ సువర్ణరాజు పాల్గొన్నారు.
అశ్వ, హనుమద్వాహన సేవ
కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం పంచమీ, షష్టి రెండు తిథులు ఉన్న కారణంగా రాత్రి అర్చకులు స్వామి వారిని ప్రత్యేక అలంకరణతో వేదమంత్రోఛ్ఛరణలతో, సన్నాయి మేళాలు, భక్తుల గోవిందనామ స్మరణ మధ్య అత్యంత వైభవంగా అశ్వవాహనం, హనుమద్వాహనంలో ఊరేగింపు సేవలు జరిపించారు.