Narayanapet | ఊట్కూర్, జూన్ 18 : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల విద్యాధికారిణిగా ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల జీహెచ్ఎం మాధవి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల జీహెచ్ఎంగా పనిచేస్తున్న ఆమెకు మండల విద్యాధికారిణిగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ జిల్లా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు ఎంఈఓగా పనిచేస్తున్న రామచంద్ర చారి ఇటీవల పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో నూతన ఎంఈఓగా మాధవి బాధ్యతలు స్వీకరించారు.
ఊట్కూరు మండల వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) మండల అధ్యక్షులు కృష్ణ, ప్రోగ్రెసివ్ రికాగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTU ) మండల అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతన ఎంఈఓను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంఈఓ మాధవి మాట్లాడుతూ.. మండలంలోని ఉపాధ్యాయులందరి సహకారంతో ప్రతి పాఠశాలను అభివృద్ధి పథంలోకి తెచ్చేందుకు తన శాయశక్తుల కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోనే విద్యా వ్యవస్థను రోల్ మోడల్‌గా నిలిపేందుకు ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, విద్యావేత్తలు సహకరించాలని కోరారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, ఇతర అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించారు.
కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం కుసుమ, తపస్ మండల కార్యదర్శి గోపాల్, మురళీధర్, రాములు, అనంత కుమార్ రెడ్డి, విజయలక్ష్మి, సంతోష్, అశోక్, కిరణ్, బనేష్, పీఆర్టీయు మండల గౌరవ అధ్యక్షుడు ఫజల్ అహ్మద్, పద్మావతి, ప్రేమకుమారి, గురునాథ్, లక్ష్మారెడ్డి, లియాఖత్, అబ్దుల్ సమద్, ఆంజనేయులు, రవికుమార్, నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.