IPL Betting | నారాయణపేట, ఏప్రిల్ 29 : ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. కొంత మందికి చేతి నిండా పని. సీజన్ ఆరంభానికి ముందు నుంచే ఎప్పుడెప్పుడు బెట్టింగ్ వేద్దామని ఆత్రుతతో ఎదురూచూస్తుంటారు. ఇప్పటికే ఐపీఎల్ ప్రారంభమై 30 రోజులు గడుస్తున్నది. మార్చి 31వ తేదీన ప్రారంభమై మే 28న ముగియనున్నది. 70 లీగ్ మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు, ఒక ఫైనల్ మ్యాచ్ చొప్పున మొత్తం 75 మ్యాచ్‌లు కొనసాగుతాయి. ఆన్లైన్ బెట్టింగ్‌పై పోలీసుల నిఘా ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా అక్కడక్కడా ఆన్లైన్ బెట్టింగ్ కొనసాగుతున్నది. అయినా ఎక్కువ శాతం యువత నేరుగా ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఆన్లైన్లో ఏ విధంగా అయితే రేషియో ఇస్తారో.. అదే విధంగా ఇస్తూ బెట్టింగ్‌లు కడుతుండడం గమనార్హం. రూ.వెయ్యి నుంచి మొదలవుతున్న బెట్టింగులు రూ.10వేలు, రూ.20 వేలు, రూ.30 వేలకు పైగా ఉన్నది. దీంతో నిత్యం ఒక్క నారాయణపేటలోనే రూ.లక్షలు బెట్టింగ్ రూపంలో చేతులు మారుతున్నాయన్నట్లు సమాచారం.
ముఖ్యంగా యువత బెట్టింగ్‌లపై దృష్టి సారించింది. ఉదయం నుంచి మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు బెట్టింగ్‌లు కడుతున్నారు. కొంత మంది అయితే మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కూడా బాల్ బాల్‌కు పందేలు వేస్తున్నారు. చాలా మంది యువకులు రూ.3 నుంచి రూ.5లకు వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి బెట్టింగ్‌లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఈ బెట్టింగ్‌లో చాలా మంది యువకులు అప్పుల పాలవుతున్నారు. అయినప్పటికీ పోయిన డబ్బులను రాబట్టుకునేందుకు మరింత అప్పులు చేసి బెట్టింగ్‌లు కడుతుండడంతో చివరకు పరిస్థితి ఎటు దారితీస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొన్నది. టాస్ ఎవరు గెలుస్తారు?, మ్యాచ్ ఎవరు గెలుస్తారు? అధిక వికెట్లు ఎవరూ తీస్తారు? ఎవరు పరుగులు చేస్తారు? సిక్సులు, ఫోర్లు వంటి వాటిపై కూడా బెట్టింగ్ కడుతున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్న అనాధికార బెట్టింగ్‌లపై పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.