మరికల్ : మరికల్ మండలంలోని తీలేరు( Teeleru) సింగిల్ విండో పరిధిలో రైతులకు సరిపడా గన్నీ బ్యాగులు లేవని నారాయణపేట మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మల్లేష్, రైతు వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఇచ్చే చిట్టిలు ఉన్నా లారీలు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గురువారం తీలేరు పీఏసీఎస్ ఎదుట ధర్నా ( Dharna ) నిర్వహించారు.
డబ్బులు ఇస్తేనే లారీలు వస్తున్నాయని, ఇప్పటికే వర్షం వల్ల ధాన్యం తడిస్తే ఆరబెట్టుకుని లారీల కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. రైతులకు సరిపడ గన్ని బ్యాగులు అందజేసి లారీలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘం చైర్మన్ రాజేందర్ గౌడ్, సీఈవో కృష్ణయ్య వివరణ కోరగా విండో పరిధిలో మూడు లక్షల గన్నీ బ్యాగులు వచ్చాయని , మరో లక్ష గన్నీ బ్యాగులు అవసరం ఉన్నాయని తెలిపారు.
త్వరలోనే వాటిని తెప్పిస్తామని తెలిపారు. లారీ కాంట్రాక్టర్లు సహకరించకపోవడం పట్ల రైతులకు ఇబ్బందులు ఏర్పడ్డాయని అన్నారు. ట్రాక్టర్ల ద్వారా రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలిస్తున్నారని తెలిపారు. గద్వాల జిల్లా కేంద్రానికి సహకార సంఘం ధాన్యాన్ని కేటాయించగా మిల్లర్లతో ప్రాధేయపడి ఇక్కడ ధాన్యం విక్రయించుకునేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ ధర్నాలో రైతులు వెంకట్రాంరెడ్డి, నాగరాజు, చంద్రమౌళి, గోపాల్, శివ, రాములు, వెంకట్ రాములు పాల్గొన్నారు.