వనపర్తి, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ పథకంలో అన్నదాతల ను పలు రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. రుణమాఫీ రాక రైతులు ఒక వైపు బాధపడుతుంటే.. మరోవైపు మాఫీ అయినా సాంకేతిక సమస్యలంటూ నె లల తరబడి అమలుకు నోచుకోకపోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగా మూడు విడుతల్లో రుణమాఫీని ప్రకటించి అ మలు చేసింది.
అమలులోనే అనేక పొరపాట్లు ఉండడంతో చాలా మంది రైతులు రోడ్డెక్కుతున్నారు. సమస్యతో వచ్చిన బాధితులకు ఓదార్పునిచ్చి కనీసం విషయాన్ని చెప్పడం కూడా గగనమైంది. ఈ క్రమంలో రైతులకు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక చివరకు కలెక్టరేట్ బాట పడుతున్నారు. జిల్లాలో 56 బ్యాంకులు ఉండగా, 1,17,220 అకౌంట్ల ద్వారా పంట రుణాలిచ్చారు. మూడు విడుతల్లో కలిపి జిల్లాకు రూ.426 కోట్ల రుణమాఫీ మంజూరైంది.
జిల్లాలో మొదటి విడుత మాఫీలో 1,100 అకౌంట్లకు పైగా రుణమాఫీకి దూ రంగా ఉన్నాయి. ఈ అకౌంట్లన్నీ మాఫీ పరిధిలోకి వచ్చినవే. లిస్టులో రైతుల పేర్లు ఉన్నాయి. అయితే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు మొదటి విడుత రుణమాఫీ డబ్బులు ప్రభుత్వం నుంచి ఇంకా జమ కాలేదు. జూలై 18న తొలి మాఫీని ప్రభుత్వం విడుదల చేసిందంటే.. నేటికీ నెల దాటింది. అయినా ఇప్పటికీ వారి సమస్య తీరలేదు. మిగిలిన బ్యాంకుల్లో రుణమాఫీ డబ్బులు జమ అయినప్పటికీ జిల్లాలోని రెండు ఐవోబీ బ్రాంచ్లకు నిధులు జమకాక పోవడంతో రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలోని వీపనగండ్ల, వనపర్తి కేంద్రాల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులు కొనసాగుతున్నాయి. వీటి పరిధిలో దాదాపు రూ.లక్షలోపు రుణమున్న రైతులు, మాఫీ పథకంలోకి వచ్చే రైతుల అకౌంట్లు దాదాపు వెయ్యికిపైగా ఉన్నాయి.
మొదటి విడుత రుణమాఫీలో డబ్బులు పడని అకౌంట్ల సమస్యను 15 రోజు ల్లో క్లియర్ అవుతుందని ముందుగా ఆయా బ్యాంకుల అధికారులు చెప్పారు. ఇ ప్పుడు నెల రోజులు గడిచినా పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు తమకు రుణమాఫీ వస్తుందో లేదో అన్న గందరగోళానికి గురవుతున్నారు. రెండు నెలల నుంచి రుణమాఫీ పథకం ప్రచారం ఉధృతంగా సాగుతున్నది. రైతులు గంపెడాశలతో ఎదురుచూస్తున్నారు. సాంకేతిక సమస్య వల్ల నిధులు జమ కాలేదని, ఇందుకు సమయం తీసుకుంటుందని బ్యాంకర్లు చెబుతుండడంతో ఎటూపాలుపోని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంకా ఎన్ని రోజులు పడుతుందో ఈ సమస్య పరిష్కారానికి అంటూ రైతులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. జీరో నుంచి మొదలైన అకౌం ట్ల నెంబర్లలో చిన్నపాటి లోపం త లెత్తింది. 15 అంకెలుండాల్సిన బ్యాంకు కోడ్ 14 అంకెలు మాత్రమే కనిపిస్తున్నందునా సాఫ్ట్వేర్ లోపంతో ఈ సమస్య వచ్చిందని బ్యాంకర్లు చెబుతున్నారు.
ఒక ఇంట్లో ఇద్దరు రుణాలు పొందిన వారి ఆశలు.. అడియాశలైనట్లేనా అన్న సందేహాలు రైతుల్లో వక్తమవుతున్నాయి. పంటరుణాల కోసం ఇరువురిపై భూములను పట్టా చేసుకోవడం.. రుణాలు పొందడం జరుగుతున్నది. రేషన్ కార్డుతోపా టు ఇతర షరతులేవి లేకుండానే రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించండంతో రైతులందరూ ఆశలు పెట్టుకున్నారు. చివరకు కేవలం రూ.2 లక్షల లోపు ఉన్న రైతుల వరకే మాఫీ ప్రకటన రావడంతో జిల్లాలో వేలాది మంది రైతులు బావురుమంటున్నారు. ఒక్కొక్క ఇంట్లో ఇద్దరేసి చొప్పున రుణాలు తీసుకున్న కు టుంబాలు జిల్లాలో అధికంగానే ఉన్నాయి. కనీసం ఇంట్లో ఒక్కరికైనా మాఫీ రా వడం లేదన్న ఆందోళన వెంటాడుతున్నది.