దామరగిద్ద : రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ ( BRS ) నారాయణపేట జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి ( Rajendar Reddy ) పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండలంలోని గడిమున్కన్ పల్లిలో గురువారం నిర్వహించిన మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు చేసింది ఏమీలేదని విమర్శించారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమ పథకాలలో కోతలు, ఎగవేతలు తప్ప చేసింది శూన్యమని ఆరోపించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లలో కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే లబ్ధి జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి మేలు జరుగడం లేదని అన్నారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు పాల్గొన్నారు.