అచ్చంపేట, మే 1 : అమ్రాబాద్ మండలం దోమలపెంటలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. వారం రోజుల్లో చిరుత మూడుసార్లు ఆ ప్రదేశాల్లో సంచరిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. దోమలపెంట మాజీ ఉపసర్పంచ్ బుద్దుల ప్రసాద్ ఇంటిముందు నుంచి వెళ్లిన చిరుతపులి కదిలికలు సీసీ కెమెరాలో రికార్డు అయింది. బుధవారం రాత్రి 11గంటల ప్రాంతంలో ఇంటిముందు నుంచి వెళ్లినట్లు ప్రసాద్ తెలిపారు. దోమలపెంట, ఈగలపెంట ప్రాంతాల్లో తరుచూ చిరుతపులి సంచరిస్తుండగా స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
చిరుతపులి మనుషులపై ఎలాంటి దాడి చేయలేదు. పిల్లులు, కుక్కలను మాయం చేస్తుందని స్థానికులు తెలిపారు. అయితే నిత్యం రాత్రివేళ గ్రామంలో సంచరిస్తుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దోమలపెంట, ఈగలపెంట గ్రామాలు అడవిని ఆనుకొని ఉండడంతో చిరుత పలుసార్లు గ్రామంలోకి సంచరిస్తోంది. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత గ్రామంలోకి రాకుండా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.