నవాబ్‌పేట, ఏప్రిల్11 : మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం యన్మన్గండ్ల గ్రామ శివారులోని ద్యావర గుట్టపై పట్టపగలే రెండు చిరుతలు సంచరించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని యన్మన్గండ్ల గ్రామానికి కూత వేటు దూరంలోనే ద్యావర గుట్ట ఉంటుంది.
అక్కడ గుట్టపై శుక్రవారం సాయంత్రం వ్యవసాయ పొలాల వద్ద గ్రామస్తులకు రెండు చిరుతలు కనిపించాయి. వీటిని చూసిన ప్రజలు గ్రామంలోని వారికి సమాచారం చేరవేయడంతో గ్రామస్తులంతా అక్కడికి చేరుకొని దూరం నుంచి వాటిని చూసి భయాందోళనకు గురయ్యారు. అటవీ శాఖ అధికారులు స్పందించి జనావాసాల్లో సంచరిస్తున్న చిరుతలపై దృష్టి సారించాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.