గద్వాల, నవంబర్ 21 : ధాన్యం కొనుగోలు కేం ద్రం ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే బండ్ల, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరిత వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ధాన్యాన్ని మేమంటే మేమే కొనుగోలు చేస్తామంటూ ఆధిపత్యం కోసం అధికార పార్టీలోని రెండు వర్గాల మహిళా గ్రూపులు బాహాబాహీకి దిగాయి. దీంతో కేంద్రం ప్రారంభోత్సవం వాయిదా పడింది. వాస్తవంగా సంబంధిత శాఖ అధికారులు దగ్గరుండి కొనుగోలు కేంద్రం ప్రారంభించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. అధికారులు లేకుండానే గ్రా మస్తులు సెంటర్ ప్రారంభానికి ఏర్పాట్లు చేసుకున్నా రు. ప్రారంభం వాయిదా పడడంతో ధాన్యం తెచ్చిన రైతులు అవస్థలు పడ్డారు.
గద్వాల మండలం బీరెళ్లి గ్రామంలో గురువారం ఎమ్మెల్యే వర్గానికి చెందిన పూజిత, గాంధీ, ఇతర మ హిళా సంఘాలు ధాన్యం కొనుగోలు చేయడానికి ఈ నెల 19న కలెక్టర్, డీఆర్డీవో అనుమతులిచ్చారు. అయితే, గతంలో మాకు అనుమతులిచ్చారని మేమే కొనుగోలు చేస్తామని సరిత వర్గమైన నెహ్రూ, మదర్‌థెరిస్సా, వెలుగు సంఘాల వారు ఎమ్మెల్యే వర్గంతో వాదనకు దిగారు. ఇరువర్గాల తోపులాటతో ఘర్షణకు దిగారు. కొనుగోళ్లు ప్రారంభించడానికి ప్రయత్నిస్తుండడంతో మరో వర్గం కాంటాను ఎత్తుకెళ్లి వేరే చోట పడేశారు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకొని తో పులాటను నిలువరించారు.
జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యం లో మహిళా సంఘాల ద్వారా 39 చోట్ల ధాన్యం కొ నుగోలు చేస్తున్నారు. అయితే గ్రామాల్లో ఐకేపీ ద్వా రా ఒకే గ్రూపునకు రెండు సీజన్లు (యాసంగి, వానకాలం) కొనుగోలు చేసే అవకాశం ఉండడంతోపాటు గ్రామంలో పెద్దల సమక్షంలో ఒక్కో సామాజిక వర్గానికి సంబంధించిన ఒక గ్రూపునకు ఓ సీజన్లో ధా న్యం కొనుగోలు చేసే బాధ్యత అప్పగించేవారు. ఈ ఏడాది కొత్త సంఘానికి బాధ్యతలు అప్పగించాలని మహిళా సంఘాల తీర్మానం మేరకు అధికారులు కే టాయించారు.
అయితే, గతేడాది కొనుగోలు చేసిన మహిళా సంఘానికే ఈసారి కూడా సెంటర్ ఇవ్వాలని పట్టుబట్టారు. రాజకీయ కారణంగానే వేరే మహి ళా గ్రూపునకు ఇచ్చారని పాత మహిళా గ్రూప్ సభ్యు లు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇంత జరిగినా అధికారులు అక్కడికి వెళ్లకపోవడం గమనార్హం. ప్రభు త్వమే కేంద్రాలను ఏర్పాటు చేస్తే.. అదే పార్టీ నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవకు దిగడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయం మీ రు చేసుకోవాలని కొనుగోలు కేంద్రాలపై మీ పెత్తనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మాకంటే మాకు అనుమతిచ్చారని.., మేమే కొనుగోలు చేస్తామని ఇరు వర్గాల తోపులాట రూరల్‌పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నది. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నట్లు తెలిసింది.
ఇరువర్గాలు ఘర్షణ పడి కొనుగోళ్లు నిలిచిపోయిన విషయంపై డీపీఎం రామ్మూర్తిని వివరణ కోరగా.. గొడవ మా దృష్టికి రాలేదని చెప్పారు. తాను ఇప్పుడే సోషల్ మీడియాలో చూసానన్నారు. ఘటనా స్థలానికి వెళ్లలేదా అని ప్రశ్నిస్తే.. లేదు, అయినా అది పై అధికారులు చూసుకుంటారని సమాధానమిచ్చారు.