Lattupally | బిజినేపల్లి, జూన్ 1 : లట్టుపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల వారు ఆదివారం లట్టుపల్లిలోని కూడలిలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల క్రితమే తమ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలంటూ ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. కానీ ప్రస్తుతం మాకు ఎలాంటి సమాచారం లేకుండా మంగనూరు గ్రామాన్ని మండల కేంద్రం చేస్తున్నట్లు ప్రకటించడం జరిగిందని తెలిపారు.
లట్టుపల్లి గ్రామంతో పాటు దీని పరిధిలోని ఆరు గిరిజన తండాల గ్రామ పంచాయతీలు కలవన్నారు. వీటితోపాటు సమీపంలోని గంగారం వాసురాంతండ, పెద్దతాండ, కిమ్యా తాండా, శ్రీపురం తండా, ముందరి తండాలతోపాటు మంగనూరు, గౌరారం గ్రామాలను కలుపుకొని లట్టుపల్లిని మండల కేంద్రం చేయాలని కోరారు. మండల కేంద్రం ఏర్పాటు చేయడం కోసం లట్టుపల్లికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కాబట్టి మండల కేంద్రంగా లట్టుపల్లిని ఏర్పాటు చేయాలని అన్నారు. కార్యక్రమంలో భూషయ్య, గోవింద నాయక్, తిరుపతిరెడ్డి, వెంకటయ్య, రామకృష్ణ, శ్రీనివాసులు, చంద్రయ్య, బసవ రెడ్డి, రాజు, దీపక్ తదితరులు ఉన్నారు.