Lattupally | బిజినేపల్లి, జూన్ 3 : బిజినేపల్లి మండల పరిధిలోని లట్టుపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ఆ గ్రామస్తులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాల క్రితమే మా గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించమని ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకరావడం జరిగింది. మా లట్టుపల్లి గ్రామస్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మంగనూర్ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటిస్తారని తెలిసిందన్నారు. లట్టుపల్లి గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేశారు.
మా గ్రామానికి సుమారుగా 6 గిరిజన గ్రామ పంచాయితీలు, మా లట్టుపల్లి గ్రామ పంచాయతి మొత్తం 7 గ్రామ పంచాయితీలు కలవు. 2 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయన్నారు. మా గ్రామ సమీపంలో గంగారం, గంగారం గ్రామ పరిధిలో గల 3 గిరిజన గ్రామ పంచాయతీలు, ముందరి తాండ గ్రామ పంచాయతీ, మంగనూర్, గౌరారం గ్రామ పంచాయతీలు కలవు. మండల కేంద్రం ఏర్పాటు చేయుటకు అన్నివిధాలుగా భవన సముదాయములు కూడా ఉన్నాయని అన్నారు. మండల కేంద్రాన్ని ఏర్పాటు చేయగలరని కోరారు. ఈ కార్యక్రమంలో గోవింద నాయక్, తిరుపతి రెడ్డి, శ్రీనివాసులు, ప్రేమ్ లాల్, శ్రీను తదితరులు ఉన్నారు.