మక్తల్, జూలై 8 : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం రైతుల వద్ద నుంచి చేపట్టే భూసేకరణలో ఎకరాకు రూ.40 లక్షల పరిహారం ఇస్తేనే ప్రాజెక్టు నిర్మాణం కోసం తమ భూములు ఇస్తామని ఆర్డీవో రాంచందర్‌నాయక్ రైతులు తేల్చిచెప్పారు. మక్తల్ మండలంలోని కాట్రేవుపల్లి, ఎర్నగాన్పల్లి గ్రామాల రైతులతో మంగళవారం నారాయణపేట ఆర్డీవో రాంచందర్ భూసేకరణ నిమిత్తం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పేట- కొడంగల్ ఎత్తిపోతల భూసేకరణ కోసం చేపట్టే అవార్డు కోసం రైతులు సంతకాలు చేయాలని రైతులపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం రైతులు భూములు కచ్చితంగా ఇవ్వాల్సిందేనని, 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా భూముల కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని, అంతకంటే ఎకువగా ఒక రూపాయి కూడా ప్రభుత్వం అందించలేదని ఆర్డీవో రైతులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా, భూ సేకరణ కోసం రైతులను ఒప్పించే ప్ర యత్నం చేస్తున్నారని వాపోయారు. రైతులు సామరస్యం గా ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇస్తే ఓకే అని, లేకుంటే రైతుల ద్వారా ఏ విధంగా తీసుకోవాలో ప్రభుత్వానికి తెలుసు అని ఆర్డీవో హెచ్చరించడంపై తీవ్రంగా మండిపడ్డారు.
ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టుకు రైతులం ఏ మాత్రం వ్యతిరేకం కాదని, భూమికి తగ్గట్టుగా ఎకరానికి రూ.40 లక్షల పరిహారం రైతులకు అందిస్తే ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఆర్డీవోకు చెబుతున్నా ఆయన రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులను కాపాడాల్సిన అధికారులే రైతులపై ఒత్తిడి తెస్తే రైతులు ఎవరి దగ్గరికి వెళ్లి తమ బాధను చెప్పుకోవాలని భూముల కోల్పోతున్న రైతులు తమ ఆవేదనను ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. అనంతరం మక్తల్‌లో మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి తమ సమస్యలను వివరించగా కొడంగల్ నియోజకవర్గంలో రైతులకు అందించే పరిహారం మాదిరిగానే ప్రతి ఒక్క రైతుకు పరిహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటాని హామీ ఇచ్చారు.