జడ్చర్లటౌన్, సెప్టెంబర్19 : గిరిజనులు అన్ని విధాలా అభివృద్ది చెందాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే కుట్రలను వ్యతిరేకిస్తూ గిరిజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జడ్చర్ల తాసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పాల్గొని సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపి గిరిజనులకు 6 శాతం నుంచి 10 శాతం రిజర్వేషన్లు పెంచారని గుర్తు చేశారు. లంబాడీలను రిజర్వేషన్ల నుంచి తొలగించాలని ఓ దౌర్భాగ్యామైన ఆలోచనతో సుప్రీం కోర్టుకు వెళ్లి అమలు చేయాలని కోరటం దురదృష్టకరం అని చెప్పారు.
రాజ్యాంగబద్ధంగా కొనసాగుతున్న లంబాడీలను ఎస్టీ జాబితాల్లో తొలగించే కుట్రలను సహించమన్నారు. గిరిజనులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వడ్త్యావత్ రమేశ్‌నాయక్ మాట్లాడారు. ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసపూరితంగా కుట్ర చేసి సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారన్నారు. లంబాడీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపీ సోయం బాబురావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులను వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కుట్రలను వ్యతిరేకిస్తూ ఈనెల 22 సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు నిర్వహించే నిరసన కార్యక్రమానికి బంజారా నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తరలిరావాలని పిలుపునిచ్చారు.
అనంతరం నిరాహార దీక్ష చేపట్టిన నాయకులకు మాజీ మంత్రి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేయించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీవైస్ చైర్మన్ యాదయ్య, సర్పంచుల సంఘం మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, కౌన్సిలర్ ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నాగిరెడ్డి, శ్రీకాంత్, ఇంతియాజ్, కరాటే శ్రీను, రఘుపతిరెడ్డి, ఫకీర్ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు జహంగీర్‌పాషా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భరత్, గిరిజన సంఘం నాయకులు సంతోష్‌నాయక్, గోపాల్‌నాయక్, రామునాయక్, డీ లక్ష్మణ్‌నాయక్, సురేందర్‌నాయక్, రాజేశ్‌నాయక్, రాజునాయక్, కిషన్, రమేశ్, తిరుపతి, గంగ్యానాయక్, గోపాల్‌నాయక్, శంకర్‌నాయక్, రవినాయక్, తారాసింగ్, పూజ, సరోజ, మౌనిక, సరిత, సింధు తదితరులు పాల్గొన్నారు.