భూత్పూర్, ఏప్రిల్ 16 : బ్యాంకులలో తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని సిర్డ్ సంస్థ జిల్లా కార్యదర్శి కురుమూర్తి అన్నారు. బుధవారం మండలంలోని హస్నాపూర్ గ్రామంలో మహిళా సంఘాలతో ఆర్బీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిర్డ్ సంస్థ ప్రజలను చైతన్య పరచడానికి పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యంగా ఈ సంస్థ ప్రజలలో సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాలను కళాజాత రూపంలో ఆటపాటలతో అందరికీ అర్థమయ్యే శైలిలో వివరిస్తుందని ఆయన గుర్తు చేశారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న ప్రజలలో పూర్తిస్థాయిలో అవగాహన లేదని ఆయన పేర్కొన్నారు.
ముఖ్యంగా గ్రామాలలో బాల్యవివాహాలు, అక్షరాస్యతపై అవగాహన లేకపోవడం బాధాకరమన్నారు. బ్యాంకుల్లో ఫిక్స్ డిపాజిట్లు ఉన్నటువంటి ఖాతాదారులు తమ నామినీ పేరును విధిగా సూచించాలని తెలిపారు. అంతేకాకుండా మహిళలు సెల్ ఫోన్ లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రుణాలను ఇస్తామని చెప్పడంతో వారికి ఓటిపి చెప్పడం వలన పెద్ద మొత్తంలో మోసాలు జరుగుతున్నాయని, అలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ అరుణ్ కుమార్, రిసోర్స్ పర్సన్ శశికళ, కళాజాత బృందం నారాయణ, శివ తదితరులు పాల్గొన్నారు.