కొల్లాపూర్, అక్టోబర్ 11 : మ నిషికైనా, యంత్రానికై నా విశ్రాంతి ఉంటే జీవితకా లం.. వాటి సా మర్థ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. కానీ దీర్ఘకాలికంగా.. విశ్రాంతి లేకుండా నడుస్తున్న మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ (ఎంజీకేఎల్ఐ) మొదటి పంప్‌హౌస్‌లోని 30 మెగావాట్స్ మో టార్లు ప్రమాదపు అంచున ఉన్నాయి. ఏ క్షణమైనా.. చిన్న సమస్య కూడా పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం ఉన్నదని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. 2014, 2020లో కేఎల్ఐ ప్రాజెక్టు ప్రకృతి విపత్తు ప్రమాదానికి కారణమైతే.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును ప్రమాదపు అంచున నెడుతున్నదని రిటైర్ట్ ఇంజినీర్లు మండిపడ్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని మొదటి ప్యాకేజీలోని అంజనగిరి రిజర్వాయర్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెండు టీఎంసీల నీటిని నిల్వ చేశారు.
మిషన్ భగీరథ ప్రాజెక్టుకు అంజనగిరి రిజర్వాయర్ ప్రత్యామ్నాయంగా ఉన్నా కేఎల్ఐ పం పులను ఏకధాటిగా రన్ చేస్తున్నారు. దీంతో కేఎల్ఐ ప్రాజెక్టులోని పంప్‌లు ఒకవేళ ఆగిపోతే మరమ్మతు పనులు చేపట్టేందుకు దీర్ఘకాల సమయం పట్టే అవకాశం ఉన్నదని సాగునీటి నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని పర్యవసనంగా సాగునీటి ఎత్తిపోత నిలిచిపోవడంతోపాటు మిషన్ భగీరథ ప్రాజెక్టుకు రా వాటర్ ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. ఇదే గనుక జరిగితే ఉమ్మడి పాలమూరుతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని కొన్ని నివాస ప్రాంతాలకు తాగునీటి సమస్య ఏర్పాడే అవకాశం లేకపోలేదు. కేఎల్ఐ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు బలికాబోతుందా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో చెంతనే కృష్ణానది పరవళ్లు తొక్కుతున్నా.. సాగునీళ్లు పారించకపోవడంతో ఇక్కడి నేలలు నెర్రె లు బారాయి. దీంతో వ్యవసాయ చేయలేక స్థానికులు వేల సంఖ్యలో వలసల బాట పట్టారు. తెలంగాణలోని ప్రజా సం ఘాల ఆందోళనలతో అయిష్టంగానే కొల్లాపూర్ మండలం ఎ ల్లూరు సమీపంలోని రేగుమాన్గడ్డ వద్ద ఎంజీకేఎల్‌ఐకి 1984లో నాటి పాలకులు శంకుస్థాపన చేశారు. అనాటి ను ంచి సమాఖ్య పాలనలో అడుగడుగునా ఈ ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. 2014 ఏడాదిలో తెలంగాణ స్వరాష్ట్రంలో స్వ యం పాలనలో.. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది. అయితే 2014, 2020 కృష్ణానదికి భారీ వరదలు రావడంతో ఈ ప్రాజెక్టు ముంపునకు గురైంది. సమాఖ్య పాలనలో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అప్రోచ్ కెనాల్.. సర్జ్‌పూల్ వద్ద నీటిని నియంత్రించేందుకు రక్షణ గేట్లను ఏర్పాటు చేయకపోవడంతో ప్రాజెక్టులోకి వరద ప్రవేశించింది. ఈ విషయంలో నిపుణులు వారి అభిప్రాయాలను వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత మూలంగా కేఎల్ఐ మోటర్లను ఏకధాటిగా రన్నింగ్ చేస్తూ నీటిని పంపింగ్ చేయిస్తున్నారు. నిరంతర మోటర్లు నడుస్తుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నా.. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టంతో ఉన్నది. వరదలు పెరిగే కొద్దీ కేఎల్ఐ ప్రాజెక్టుపై ఒత్తిడి కూడా పెరుగుతోందని గతంలో జరిగిన సంఘటనలు ఉదాహరణగా ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
అయినా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు ప్రాజెక్టును ప్రమాదంలోకి నెట్టివేస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఎంజీకేఎల్‌ఐలో 1, 2, 4 మోటార్లు మాత్రమే పని చేస్తున్నాయి. స్టాండ్ బై మోటర్తో కూడా తప్పని పరిస్థితిలో నీటిని లిప్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోటర్లకు రెస్ట్ ఇవ్వకుండా రన్ చేస్తున్నారు. 30 మెగా వాట్స్‌తో రోజుకు ఒక పంప్ 800 క్యూసెక్కుల నీటిని డ్రా చేస్తోంది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 50 టీఎంసీల వరకు కృష్ణా నీటిని లిఫ్ట్ చేసినట్లు కూడా బయటకు వార్తలు వచ్చాయి. మోటర్లకు మరమ్మతులు చేసుకునేందుకు విడుతల వారీగా ఆపరేట్ చేయడం అధికారులు నిత్యం అవలంభించే విధానం. అయితే కేఎల్ఐ మోటర్లను మాత్రం నిరంతరం రన్నింగ్ చేస్తున్నారు.
కంటిన్యూగా పనిచేయడంతో బేరింగ్లు, ఇతర యంత్ర భాగాలపై భారం పడి వాటి జీవితకాలం తగ్గుతుతందని రిటైర్ట్ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. అంతేకాదు మోటర్లలో సాంకేతిక లోపాలు ఏర్పడితే సబ్ మెర్షన్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అధిక వేడి ఏర్పడి మోటర్ల వైండింగ్ దెబ్బతింటే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఏమైనా సమస్యలు ఉత్పన్నమైనా.. మోటర్ల మరమ్మతులకు పట్టే సమయంలో మిషన్ భగీరథకు నీటి సమస్య లేకుండా పీఆర్ఎల్ఐ మొదటి రిజర్వాయర్ నుంచి తాగునీటిని అందించవచ్చన్న ధోరణిలో కొందరు అధికారులు ఉన్నట్లు తెలిసింది. ఈ విషయాలపై అవగాహన లేని ప్రభుత్వం ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేఎల్ఐ రక్షణకు చర్యలు తీసుకోవాలని రైతులు, సాగునీటి రంగం నిపుణులు సూచిస్తున్నారు.
2020లో జరిగిన ప్రమాదంలో నీటిని ఎత్తిపోసే ఐదు మోటార్లు ముంపునకు గురైన వెంటనే బీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన నెలరోజుల్లోపే మొదటి పంప్‌ను పునరుద్ధరణ చేసింది. ఆ వెంటనే సాగునీరు పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్నది. దీంతో పంటలకు ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేసింది. ఈ విషయాన్ని ప్రాజెక్టు పరిధిలోని రైతులు సైతం ఇప్పటికి గతాన్ని నెమరేసుకుంటారు. కాగా 2023 సెప్టెంబర్ 16న నాటి సీఎం కేసీఆర్ కృష్ణానది నీటిని పీఆర్ఎల్ఐ బాహుబలి మోటర్తో రెండు టీఎంసీలను అంజనగిరి రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేశారు.
భవిష్యత్‌లో ఏ చిన్న సమస్య తలెత్తినా సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుచూపుతో పంపింగ్ ప్రారంభించింది. అంజనగిరి రిజర్వాయర్ నుంచి ఎంజీకేఎల్ఐ మొదటి లిఫ్ట్‌నకు నీటిని తరలించేలా లింక్ ఏర్పాటు చేశారు. ఐదు మోటర్లతో మిషన్ భగీరథతో పాటు రైతులకు సాగునీటిని మోటర్లు అందించాయి. ఈ సమయంలో విడుతల వారీగా మోటర్లకు విశ్రాంతి ఇస్తూ పంపింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. మోటర్లకు విశ్రాంతి ఇచ్చేందుకు పీఆర్ఎల్ఐ రూపంలో ప్రత్యామ్నాయం ఉన్నా మోటర్లను రన్ చేయించడంపై ఇంజినీర్లు దృష్టి సారించారు.
ఉమ్మడి పాలమూరుకు చెందిన వ్యక్తి సీఎంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతంలోని ప్రాజెక్టులపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టు కొల్లాపూర్ ప్రాంతానికి మాత్రమే కాకుండా ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు సైతం సాగు, తాగునీళ్లు అందిస్తున్నది. ఇలాంటి ప్రాజెక్టు నిర్మాణంలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రాజెక్టు భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టులోకి నేరుగా వరద నీళ్లు రాకుండా రక్షణ గేట్లను ఏర్పాటు చేయాలి. ఈ ప్రాజెక్టు ఇక్కడి రైతులకు వరప్రదాయని. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు.
– బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే