మక్తల్ : నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల ( Kodangal Lift Irrigations ) పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ ( BRS ) అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ( Former MLA Chittem ) తెలిపారు. శనివారం మక్తల్ మండలంలోని కాట్రేవ్ పల్లి గ్రామ రైతులు మాజీ ఎమ్మెల్యేను కలిసి సమస్యను విన్నవించారు.
చిట్టెం మాట్లాడుతూ ప్రభుత్వం భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్‌కు నీటిని తీసుకువెళ్లేందుకు రైతులకు ఎలాంటి సమాచారాలు అందించకుండానే పేదల భూముల్లో ఇష్టం వచ్చిన రీతిలో సర్వేలు చేస్తున్నారని మండిపడ్డారు. సర్వే పేరుతో రైతులను ఇబ్బంది చేయడం విచారకరమని అన్నారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, పూర్తిస్థాయిలో అనుమతులను తీసుకున్న తర్వాతనే ప్రాజెక్టు పనులు ప్రారంభించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
మక్తల్ మండలంలోని భూత్పూర్ వద్ద నిర్మించిన రిజర్వాయర్ 1.31 టీఎంసీ సామర్థ్యం మాత్రమే ఉందని, ఇక్కడి నుంచి కొడంగల్‌కు నీటిని ఏ విధంగా తీసుకెళ్తారో సీఎంకు అవగాహన లేదని ఆరోపించారు. భూముల కోల్పోతున్న రైతులకు అడిగినంత నష్టపరిహారాన్ని అందించిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరుఫున రైతుల పక్షాన అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు.