చారకొండ, ఫిబ్రవరి 5 : ఎవరిని కదలించినా కన్నీళ్లే.. ఎక్కడ చూసినా శిథిలమైన ని ర్మాణాలే.. కష్టపడి కట్టుకున్న కలల సౌధాలు కండ్ల ముందే కూ లాయి. ఏండ్లుగా కలివిడిగా ఉన్న ఇరుగు.. పొరుగు చిల్లంపొల్లమైంది. దీంతో ఒక్కసారిగా చారకొండ మూగబోయింది. గ్రామంలోని పలు ఇండ్లపైకి బుల్డోజర్లు రావడంతో ఉద్రిక్తత నెలకొన్నది. కోదాడ-జడ్చర్ల జాతీయ రహదారి (167) నిర్మాణంలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా చారకొండ-మర్రిపల్లి మధ్య బైపాస్ నిర్మాణంలో అడ్డంగా ఉన్న 29 ఇండ్లను మంగళవారం అధికారులు నిర్ధాక్షిణ్యం గా కూల్చివేశారు. తెల్లవారేసరికి కూల్చివేతలు మొదలు కావడంతో బాధితులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు.
భారీగా మోహరించిన పోలీసులు అడ్డం వచ్చిన వారిని అ రెస్టు చేస్తుంటే.. కండ్ల ముందే కష్టపడి కట్టుకున్న ఇండ్లు కూలుతుంటే నిస్సహాయంగా చూడడం తప్పా ఏమీ చేయలేకపోయారు. గూడు లేక బా ధితులు చిన్నాభిన్నమయ్యా రు. కూల్చివేతలు ముగిశాక సామాన్ల కోసం వెతుక్కోవ డం కనిపించింది. దొరికిన కాడికి తీసుకొని కన్నీళ్లను దిగమింగుకొని అక్కడి నుంచి బరువెక్కిన గుండెలతో కదిలా రు. చలి నుంచి రక్షణగా రాత్రికి నిద్రపోయేందుకు నానా పాట్లు పడ్డారు. పశువుల దొడ్లు.. షెడ్లు.. ఇలా కొందరు తెలిసిన వారి ఇండ్లకు వెళ్లగా.. మరికొందరు బంధువుల ఇండ్ల ల్లో షెల్టర్ తీసుకొన్నారు.
తమకు ఇచ్చిన నష్టపరిహారంతో ఎక్కడకు వెళ్లాలని.. కొందామంటే కనీసం ఇంటి జాగా కూడా రాదని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వం కోల్పోయి రోడ్డు పాలయ్యాయమని దీనంగా చెప్పారు. ఇంటి స్థలం ఇవ్వడంతోపాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డునే విస్తరించాలని అనేక దఫాలుగా ఆందోళనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేయడంతో కొన్నేండ్లుగా రోడ్డు జోలికి అధికారులు వెళ్లలేదు. కా నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కసారిగా అధికార యంత్రాం గం ముందస్తు సమాచారం లేకుండానే ఇండ్లపైకి జేసీబీల ను ఎక్కుపెట్టింది. ప్రత్యామ్నాయం చూపకుండా కూల్చివేతలు చేపట్టడంతో దుఃఖంతో దొరికిన సామగ్రిని వెతికి ప ట్టుకోవడం బాధితుల వంతైంది. కూలీ.. నాలి చేసి ఇండ్లు నిర్మించుకుంటే కూల్చివేయడంతో కుమిలిపోయారు.
నోట్లోకి అన్నం ముద్ద పోతలే..
జాతీయ రహదారి బైపాస్ నిర్మాణంలో మాకున్న 22 అరల జాగతోపాటు ఇళ్లు కోల్పోయాం. మేము ఐదుగురు అన్నదమ్ములం. అందరం కలిసి ఒక్కో గదిలో కుటుంబంతో కలిసి ఉండేటోళ్లం.. మాకు ప్రభుత్వం రూ.7 లక్షలు మాత్రమే నష్ట పరిహారం చెల్లించింది. ఆ డబ్బులతో ఎక్కడికి వెళ్లినా కనీసం వంద గజాల జాగ రాదు. అంత తక్కువ పరిహారమిస్తే మేమెట్లా బతికేది.. పొద్దున్నే ఇంటిపైకి జేసీబీలు.. పోలీసులతో వచ్చి మా గూడును కూల్చేశారు. మా సామాన్లు తీసుకుంటామన్న వినలేదు. సమయం ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు.. దండం పెట్టి వేడుకున్నా కనికరించలేదు.. నిమిషాల్లో ఇంటిని నేలమట్టం చేశారు. మా పిల్లలతో కలిసి రూ.4 వేలకు అద్దెకు గది తీసుకొని రాత్రి ఉన్నాను.. నాకు ప్రభుత్వం ఇంటి జాగ ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి.. నాలోంటి వారికి పరిహారం పెంచి ఇవ్వాలి.
– కొప్పు లక్ష్మయ్య, చారకొండ
నా పరిస్థితి ఎవరికి చెప్పాలి
నాకు ఉన్న 12 అరల జాగలో మా అమ్మ, నాన్న ఉన్నప్పుడు ఇల్లు కట్టారు. వారు చనిపోయినా వారి గుర్తుగా ఇల్లు మాత్రమే మిగిలింది. ఇప్పుడేమో జాతీయ రహదారి కోసం బైపాస్ కట్టాలని నా ఇల్లు మొత్తం కూల్చారు. నేను ఒంటరి వాడినయ్యాను.. ఇల్లు కూల్చివేయడంతో మా అమ్మ ఊరైన నల్లగొండ జిల్లా ఎర్రగుంట పల్లికి వెళ్లి ఉంటున్నా.. ప్రభుత్వం నాకు ఇంటిస్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఆదుకోవాలి.
ఆదుకోకుంటే చావే శరణ్యం
జాతీయ రహదారిలో నాకున్న 12 అరల ఇళ్లు కూల్చేశారు. నాకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నది. నాకు ప్రభత్వం నుంచి రూ.7 లక్షలు మాత్రమే పరిహారం కింద చెల్లించారు. కాయ కష్టం చేసి.. పైసా పైసా జమచేసి ఇల్లు కట్టుకున్నా.. ఒక్కసారిగా పోలీసులు, అధికారులు వచ్చి నా ఇంటిని మొత్తం కూల్చారు. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం ఏమాత్రం సరిపోదు. రాత్రి వేళల్లో కంటికి కునుకు కూడా రావడం లేదు. మా బతుకులు రోడ్డు పాలు చేశారు. మేమూ మా పిల్లలు ఎలా బతకాలి.. ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. లేకుంటే మా పరిస్థితి ఆగమ్యగోచరమే..