అలంపూర్, డిసెంబర్ 5 : ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ పార్టీ, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిపై ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన విజయుడిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని కేసీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మంగళవారం హైదరాబాద్‌లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డితో కలిసి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయుడు కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ నియోజకవర్గ ప్రజలు నిరాశ చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేతోపాటు నియోజకవర్గ సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.