అయిజ, అక్టోబర్ 21: కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృ ష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో 16 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్‌ఫ్లో 1,13,000 క్యూసెక్కులు ఉండగా, స్పిల్‌వే ద్వారా 82, 980 క్యూసెక్కులు విడదల చేస్తుండగా, మొత్తం అవుట్ ఫ్లో 1,19,696 క్యూసెక్కులు నమోదైంది. ఎడమ కాల్వకు 640, కుడి కాల్వకు 720, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 50 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
34,559 క్యూసెక్కుల నీటితో ఐదు యూనిట్లలో విద్యుత్పుత్తి చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.275 టీఎంసీల నిల్వ ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 55,593 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 55,593 క్యూసెక్కులు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ఠస్థాయి నీటిమట్టం 1,705 అడుగులకుగానూ 1,704.66 అడుగులు ఉన్నది. నారాయణపుర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 88,503 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 91,037 క్యూసెక్కులు ఉన్నది.
గరిష్ఠస్థాయి నీటిమట్టం 1,615 అడుగులకుగానూ ప్రస్తుతం 1,614.01 అడుగులు ఉన్నది. తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 29,834 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 29,336 క్యూసెక్కులు ఉన్నది. 105.788 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 101.421 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 43,627 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 43,000 క్యూసెక్కులు ఉన్నది. ఆర్డీఎస్ ఆయకట్టుకు 627 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఆనకట్టలో 10.8 అడుగుల మేరకు నీటిమట్టం ఉన్నది.