Jogulamba Gadwal | ఎర్రవల్లి : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా పదో బెటాలియన్ గేట్ ఎదురుగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. అయితే, జాతీయ రహదారిపైనే వాహనాలను నిలిపివేసి ఇద్దరు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలోనే బెంగలూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు వెళ్తున్న కంటైనర్‌పై ఉన్న ఓ భారీ బాక్స్ ఆగి ఉన్న కార్‌పై పడింది. ఈ క్రమంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దాదాపు మూడు కిలోమీటర్లకుపైగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
కంటైనర్ పడిన సమయంలో కారులో ఇద్దరు యువతులు ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు ఇద్దరు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది క్లియర్ చేస్తున్నారు. దాదాపు మూడు కిలోమీటర్లకుపైగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు గురయ్యారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రమాదం జరగ్గా.. రాత్రి 9.30 గంటలు గడిచినా ఇప్పటికీ ట్రాఫిక్ జామ్ కొనసాగుతూనే ఉన్నది. పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవడంతో అటు ట్రాఫిక్ని క్రమబద్దీకరించడం సిబ్బందికి సైతం ఇబ్బందికరంగా మారింది. కర్నూల్ టూ హైదరాబాద్, హైదరాబాద్-కర్నూల్ రహదారులపై పూర్తిగా వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.