జడ్చర్ల, మార్చి 13 : వేసవిని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం మున్సిపాలిటీలోని పందిరిగుట్ట వద్ద ఉన్న భగీరథ నీటిశుద్ధి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. నీటిశుద్ధి, సరఫరా, క్లోరినేషన్‌ను పరిశీలించారు. అనంతరం మిషన్ భగీరథ, ఇంట్రా, మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్చర్ల బల్దియాతోపాటు గ్రామాల్లో నీటి ఎద్దడి రాకుండా ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
ప్రజలకు అవసరమైన మేరకు సరఫరా చేయాలన్నారు. ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వాలని కోరారు. ఎక్కడైనా మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందన్న అనుమానం వస్తే ముందుగానే తెలియజేయాలని వివరించారు. మున్సిపాలిటీలో మిగిలిన పైపులైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నీటి సరఫరా సమయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. భగీరథ నీటి సరఫరా విధానాన్ని అధికారులు పర్యవేక్షించాలని, ఇందుకోసం నిర్ధిష్టమైన సమయం కేటాయించాలని పేర్కొన్నారు.
సమస్య ఎదురైతే వెంటనే మున్సిపల్, భగీరథ అధికారులు చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతిరోజు 911 మిలియన్ లీటర్లు ఫర్ డే(ఎంఎల్డీ) సరఫరా చేస్తున్నామని తెలిపారు. పెద్దగుట్టపై నుంచి నిమ్మబావిగడ్డకు మరో పైపులైన్ వేసి 1.5 ఎంఎల్డీ నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు ఎమ్మెల్యేకు అధికారులు వివరించారు. ఈ పనులు పూర్తయితే 11 మిలియన్ లీటర్లు ఫర్డే(ఎంఎల్డీ) సరఫరా కానున్నదని, జడ్చర్లకు రోజువిడిచిరోజు సరఫరా చేయొచ్చని సూచించారు. మల్లెబోయిన్పల్లి సంప్ నుంచి కావేరమ్మపేట వరకు ఉన్న పాత పైపులైన్ స్థానంలో కొత్తలైన్‌కు ప్రతిపాదనలు పంపామన్నారు. దివిటిపల్లి వద్ద 10 గుంటల స్థలాన్ని కేటాయిస్తే సంస్ ఏర్పాటు చేసి మరో 3 ఎంఎల్డీ అధికంగా సరఫరా చేయొచ్చని ఎమ్మెల్యే దృష్టికి మిషన్ భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పట్టణంలో జరుగుతున్న ప్రగతి పనుల పురోగతిని మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా శ్మశానవాటిక, రూ.2 కోట్లతో మోడ్రన్ ధోబీఘాట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 100 పడకల దవాఖానను ఏప్రిల్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. మున్సిపల్ కా ర్యాలయ భవన నిర్మాణానికి రూ.3.06 కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ లక్ష్మి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్, మిషన్ భగీరథ ఈఈ వెంకట్‌రెడ్డి, డీఈ పుల్లారెడ్డి, డిప్యూటీ ఈఈ రవిచంద్ర, మున్సిపల్ కమిషన్ మహమూద్‌షేక్, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, లత, రమేశ్, నవనీత కొండల్, సారిక, నాయకులు, ఏఈలు పాల్గొన్నారు.