అయిజ, మార్చి 17 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టలో నీటినిల్వలు అడుగంటిపోతున్నాయి. ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు తుంగభద్ర డ్యాం నుంచి విడుదల చేసిన నీళ్లు ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాయి. అయితే నీటి రాక బంద్ కావడంతో క్రమేపీ నిల్వలు తగ్గిపోతున్నాయి. ఆర్డీఎస్ ఆయకట్టులో యాసంగిలో సాగైన పంటలు చివరి దశలో ఉన్నాయి. అయితే చివ రి నాటికి నీళ్లు అందకపోతే ఎండిపోయే అవకాశాలు ఉండడంతో సాగుపై సందిగ్ధం నెలకొన్నది. తుంగభద్ర నదిలో నీటి జాడలు కనిపించకపోవడంతో తుమ్మిళ్ల పథకం పంపును అధికారులు ఈనెల 9న బంద్ చేశారు.
దీంతో మొక్కజొన్న, వరి పంటలు వాడుపడుతుండడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ ఏడాది యాసంగిలో ఆర్డీఎస్ ఆయకట్టులోని 39వేల ఎకరాలకు నీళ్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వరి, మొక్కజొన్న, జొన్న, వేరుశనగ వంటి పం టలు సాగు చేశారు. కొందరు అక్టోబర్‌లో సాగు చేయ గా.. మరికొందరు నవంబర్‌లో చేశారు. అయిజ మం డలంలో ప్రధానంగా 12వేల ఎకరాలకుపైగా వరి సాగైంది. వడ్డేపల్లి, రాజోళి మండలాల్లో మొక్కజొన్న, జొన్న, వేరుశనగ పంటలు సాగు చేశారు. కానీ కేటాయించిన నీటివాటా 5.896 టీఎంసీలు ఇప్పటికే పూర్తిగా వినియోగించారు.
ఇక చేసేదిలేక కర్ణాటక స ర్కారుపై రైతులు ఆధారపడాల్సి వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కన్నడ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఏప్రిల్ రెండో వారం వరకు 2 టీఎంసీలు ఇస్తేనే పంటలు చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పంటలకు ఏప్రిల్ రెండో వారం వరకు సాగునీరు అందితేనే పంటల దిగుబడి వస్తుంది. లేకుంటే రూ.లక్షల పెట్టుబడి చేతికొచ్చే పరిస్థితి కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు.
ఆయకట్టులో ఎండుతున్న పంటలు ఆర్డీఎస్ ఆయకట్టులో పంటలు ఎండుతున్నాయి. ఆర్డీఎస్ ఆనకట్ట ద్వారా డీ-23 వరకు నీరు అందుతోంది.
అయిజ మండలంలో వరి అధికంగా సాగు చేయడంతో ఆర్డీఎస్ నుంచి వస్తున్న నీటిని దిగువకు పంపాలని అధికారులు ప్రయత్నిస్తున్నా.. ఆనకట్టలో నీటి నిల్వలు తగ్గుతుండడంతో ప్రధాన కాల్వలో పారుదల అంతంత మాత్రంగానే ఉన్నది. ఆయకట్టుకు సాగునీరు అందకపోతే పంటల పరిస్థితి ప్రశ్నార్థకమే.. తుమ్మిళ్ల పంపునకు అందని జలాలు తుంగభద్ర నది సమీపంలో ఏర్పాటు చేసిన తుమ్మిళ్ల పంపునకు జలాలు అందకపోవడంతో ఈనెల 9వ తేదీనే నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు. దీంతో తుమ్మిళ్ల ఆయకట్టు కింద.. తనగల సమీపంలో వరి, మొక్కజొన్న పంటలు ఎండుతున్నాయి.
ఆర్డీఎస్, కేసీ కెనాల్ ఉమ్మడి ఇండెంట్ ఆదుకోలేదు. 60- 40 రేషియో ప్రకారం తెలంగాణలోని ఆర్డీఎస్, ఏపీలోని కర్నూల్ జిల్లా కేసీ కెనాల్ ఉమ్మడి ఇండెంట్ ద్వారా తుంగభద్ర డ్యాం నుంచి నీటిని తీసుకునేందుకు అవకాశం ఉన్నది. ఈ ఏడాది ఆర్డీఎస్ నీటి వాటా 5.896 టీఎంసీలు, కేసీ కెనాల్ నీటి వాటా
7.746 టీఎంసీలను ఉమ్మడిగా తీసుకున్నారు. అయినా ఆయకట్టులోని పంటలకు సాగునీరు అందలేదు. ఇరు రాష్ర్టాల సమన్వయంతో నీటిని విడుదల చేయించుకున్నా కర్ణాటకలోని రైతులు, ఎత్తిపోతల పథకాలు ఏపీ, తెలంగాణ నీటి వాటాకు గండికొట్టాయని అధికారులు, రైతులు వాపోతున్నారు. కర్ణాటకలోని రైతులు భారీ మోటార్ల సాయంతో నీటిని తోడేయడంతోనే దిగువకు తుంగభద్ర జలాలు చేరుకోలేదని అంటున్నారు.
ఆరెకరాల్లో మొక్కజొన్న సాగు చేసినం. ఇంకో రెండు తడులు పారిస్తే పంట చేతి కొస్తది. ఏట్లో నీళ్లు లేవని తు మ్మిళ్ల బంద్ పెట్టిండ్రు. తుమ్మి ళ్ల నీళ్లు బంద్పెట్టడంతో మొ క్కజొన్న, వేరుశనగ పంటలు ఎండుతున్నాయ్. ల క్షల పెట్టుబడులు పెట్టినం. పంట చేతికిరాకుంటే నష్టపోతాం. సర్కారోళ్లు కనికరించి నీళ్లిచ్చి పంటలు చేతికొచ్చేలా చూడాలి. ఆర్డీఎస్ నీళ్లన్నా కిందకు పా రించి పంటలకు అందించాలి. లేకుంటే పంటలు దెబ్బతిని ఆప్పులు పాలవడం ఖాయం.
– చాకలి గోపాల్, రైతు, తనగల, వడ్డేపల్లి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
ఆయకట్టు కింద సాగు చేసిన పంటలు నీళ్లులేక ఎండుతున్నయ్. 4 ఎకరాల్లో మొక్కజొన్న పంట చేశా. 10 దినాలుగా ఆర్డీఎస్, తుమ్మిళ్ల నుం చి నీళ్లు వస్తలేవు. నీళ్లు బంద్‌కావడంతో పంటలు ఎండుతున్నయ్. ఏప్రిల్ రెండో వారం వరకు నీళ్లిస్తేనే నవంబర్‌లో సాగు చేసిన మొక్కజొన్న, వేరుశనగ పంటలు చేతికొస్తాయ్. ప్రభుత్వం నీళ్లు అందించేలా చూడాలె. పంటలు ఎండితే అప్పుల పాలై ఇక రైతులకు చావే శరణ్యం.
– రాజు, రైతు, పెద్ద తాండ్రపాడు, రాజోళి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
ఆర్డీఎస్, తుమ్మిళ్ల పథకాల కింద ఆయకట్టుకు సాగునీళ్లు అందించడంలో అధికారు లు, సర్కారు అలసత్వం ప్ర దర్శించడంతోనే పంటలు ఎండుతున్నాయ్. అవసరంలేని సమయంలో ఆర్డీఎస్ నీ టి వాటా నుంచి నీళ్లు తీసుకుని, ఇప్పుడు పంటలు ఎండబెతారా? అప్పటి సర్కారు ఏప్రిల్ చివరి వరకు సాగునీరు ఇచ్చేది. ఇప్పడు నీటి వాటా పూర్తయిందంటూ ఎండబెడుతున్నారు. ఏప్రిల్ 10 వరకు నీళ్లిచ్చేందుకు అధికారులు చూడాలి..
– గొల్ల గట్టన్న, రైతు, తనగల, వడ్డేపల్లి మండలం, జోగుళాంబ గద్వాల జిల్లా
తుంగభద్ర నదిలో జలాలు స్వల్పంగా పెరుగుతున్నాయ్. 290.5 అడుగులకు చేరుకో గానే తుమ్మిళ్ల పంపును ప్రా రంభించేందుకు చర్యలు తీసు కుంటున్నాం. ఈ పంపు హౌ స్లో ప్రస్తుతం 290.3 అడు గుల నీటిమట్టం ఉన్నది. ఆర్డీఎస్ నీళ్లు డీ-23 వర కు చేరుకుంటున్నాయి. దిగువకు చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం వస్తున్న నీటితో ఒక తడి పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. తుం గభద్ర నదిలో నీటి మట్టం పెరగగానే తుమ్మిళ్ల పం పును ప్రారంభించి దిగువకు నీటి అందిస్తాం.
– విజయ్‌కుమార్‌రెడ్డి, ఈఈ ఆర్డీఎస్ ప్రాజెక్టు