వేసవి ప్రారంభంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటికి కష్టం మొదలైంది. భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. బోరు, బావులు, చెరువులు ఎండిపోతుండడం.. ప్రాజెక్టుల్లో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోతుండడం.. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడం.. ప్రభుత్వం సాగునీటిని ఒడిసిపట్టడంలో ముందుచూపు లేకపోవడం.. ఇవన్నీ యాసంగి సాగుకు శాపంగా మారాయి. దీంతో నేడు బోర్లు, కాల్వలు వట్టిబోయి పంట చేలు ఎండుతున్నాయి. పంట చేతికొచ్చే దశలో రైతుల ఆశలన్నీ నిరాశగా మారాయి. ఇప్పటికే వరి పొలాలు నీళ్లులేక నెర్రెలుబారగా.. రైతన్నకు గుండెకోత మిగులుతోంది. కొందరు రైతులు తడి కోసం తాపత్రయపడుతున్నారు. అయినా నీటి వసతి లేక కష్టపడి సాగు చేసిన పంట చేతికందక ఆందోళన చెందుతున్నాడు.
– నెట్వర్క్ మహబూబ్నగర్, మార్చి 20
జడ్చర్ల, మార్చి 20 : యాసంగి సాగు రైతులకు కన్నీరే ముగిలిస్తున్నది. ఎంతో ఆశతో సాగు చేయగా, విద్యుత్ కోతలు.. సాగునీటి సదుపాయం లేక పంటలు ఎండుముఖం పట్టాయి. భూగర్భజలాలు అడుగంటడంతో బోరుమోటర్లు సైతం పనిచేయడం లేదు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. జడ్చర్ల మండలంలోని కోడ్గల్, కర్వపల్లి, మల్లెబోయిన్పల్లి, పోచమ్మగడ్డతండా తదితర గ్రామాల్లో భూగర్బజలాలు అడుగంటి పంటలు ఎండిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. 20రోజులుగా నీళ్లు రాక అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పెడచెవిన పెట్టడంతో ఎకరాకు రూ.25-30వేల పెట్టుబడి పెట్టి నిండా మునిగామని వాపోతున్నారు. జడ్చర్ల మండలంలో 8వేలకు పైగా ఎకరాల్లో వరిసాగు చేశారు. పంటలన్నీ ఎండిపోయి దిక్కుతోచని స్థితిలో పడిపోయామని, ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
మహ్మదాబాద్, మార్చి 20 : యాసంగిపై కోటి ఆశలతో సాగుచేసిన వరిపంట రైతులకు నిరాశను మిగిల్చాయి. భూగర్భజలాలు అడుగంటి పంటలు ఎండిపోయాయి. ఉన్నబోర్లు నీళ్లు పోయకపోవడంతో ఆశ చావక పంటలను కాపాడుకునేందుకు కొత్త బోరు వేయించి రైతులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. మహ్మదాబాద్కు చెందిన రైతు కుర్వ శేఖర్ రెండెకరాలల్లో వరి సాగు చేయగా.. నీళ్లు లేక ఎండింది. ఆరేడేండ్ల నుంచి బోర్లు నీళ్లు పోశాయని, ఒక్కసారిగా వట్టిబోవడంతో రైతు ఆందోళన చెందాడు. రైతుభరోసా టైంకు రాక అప్పులు తెచ్చి సాగుబడు చేశామని, అయినా పంట చేతికిరాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
హన్వాడ, మార్చి 20 : భూగర్భజలాలు అడుగంటడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని తిరుమలగిరికి చెందిన రామలింగం, శివరాజ్ ఇద్దరూ అన్నదమ్ములు. ఎకరాకు రూ.30వేల చొప్పున ఖర్చు చేసి ఆరెకరాల్లో వరి సాగుచేశారు. పంటచేతికొచ్చే సమయంలో భూగర్భజలాలు అడుగంటి బోర్లు చుక్క నీళ్లు పోయడం లేదు. రూ.2లక్షలు అప్పు చేసి పంటలు సాగు చేయగా, పంట ఎండిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని వాపోతున్నారు. సర్కారు సాయం అందించి మమ్మల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంటలను సాగుచేస్తే మధ్యలోనే ఎండిపోయాయి. ఉన్న బోర్లు కూడా నీళ్లు పో యడం లేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. పంటలు ఇంకో ఐదారు రోజులైతే చేతికొచ్చే పరిస్థితి లేదు. చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే కన్నీళ్లొస్తున్నాయి. ఎకరాకు రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టినం. పైసలన్నీ మట్టిలో పోసినట్లయ్యింది. ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి.
– చిన్నోజీ, రైతు, కోడ్గల్, జడ్చర్ల
రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఐదెకరాల్లో వరి పం ట సాగు చేశా. ఆరేండ్లలో ఎన్న డూ పంటలు ఎండిపోలేదు. ఈ ఏడాది అదే ధైర్యంతో సాగు చేయగా, పంట చేతికొచ్చే దశలో ఎండిపోయింది. చేసేది లేక గొర్రెలకు మేతగా వదిలేశా. ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
– తలారి మల్లేశ్, రైతు, మహ్మదాబాద్, మహబూబ్నగర్ జిల్లా