గద్వాల, మార్చి 28 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో కాల్వలు ఎండిపోయి నీరులేక నియోజకవర్గంలో పొలాలు ఎండిపోవడంతో రైతులకు కన్నీళ్లే మిగిలాయని గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంతునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గద్వాల మండలం కొత్తపల్లిలో ఎండిపోయిన వరిపంట పొలాలను బైక్పై వెళ్లి, పార్టీ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కక్ష కట్టిందన్నారు.
పంటలు ఎండుతున్న ఈ ప్రభుత్వానికి పట్టడం లేదని ఆరోపించారు. పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికార పార్టీ నాయకులకు వారిని పరామర్శించే తీరికలేకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనతోనే పంటలు ఎండిపోతున్నాయని దీంతో రైతులు నష్టపోయే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో మండుటెండల్లో సాగునీటి కాల్వలు జలాలతో కళకళలాడాయని, నేడు రేవంత్ పాలనలో అదే కాల్వలు నీళ్లులేక వెలవెల బోతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాల్వలు ఎడారిగా మారాయని, నీరు లేక రైతులు సాగు చేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు కూడా పంటలు ఎండి పోయిన సందర్భాలు లేవన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేక ప్రాజెక్టుల ద్వారా నీరు అందించలేక పోతుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి పంటను సాగు చేయడానికి ఆసాముల దగ్గర అప్పులు తెచ్చి సాగు చేసిన పంటలకు పెట్టుబడులు పెట్టామని ప్రస్తుతం నీళ్లు లేక పంటమొత్తం ఎండిపోయిందని బోరున విలపించారు. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు స్పందించి కాల్వలకు నీటిని వదిలి పంటలు కాపాడాలని డిమాండ్ చేశారు.