గద్వాల, మే 25 : నడిగడ్డలో గులాబీ జెండాకు పూర్వవైభవం సంత రించుకోనున్నది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ వదిలి వెళ్లిన వారికి తగిన బుద్ధి చెప్పాలనే ఆలోచన నడిగడ్డ ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో మొదలైంది. పార్టీలోకి వచ్చి పోయే నాయకులు ముఖ్యం కాదని నాయకులు వస్తుంటారు.. పోతుంటారు కాని పార్టీ ముఖ్య మనే భావన నడిగడ్డ ప్రజల్లో నెలకొన్నది.
గద్వాల నియోజకవర్గంలో మేము లేకుంటే పార్టీ లేదు.. మేము ఉంటేనే పార్టీకి బలం బలగం అనే చెప్పుకునే వారికి చెంప పెట్టులా వారికి దిమ్మతిరిగేలా షాక్ ఇవ్వడానికి గద్వాల నియోజకవర్గ ప్రజలతోపాటు మాజీ ప్రజా ప్రతినిధులు రేడీ అయ్యారు. పార్టీలోకి ఎవరు వచ్చినా వెళ్లిపోయినా పార్టీకి బలం కార్యకర్తలే అనే చెప్పే విధంగా చేరికలు ఉండేలా ఇక్కడి బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు బాసు హన్మంతు ఉన్నారు. ఇక్కడి ఇద్దరు ప్రజాప్రతినిధులు పార్టీ పదవులు అనుభవించి పార్టీకి ద్రోహం చేసి వెళ్లినా పార్టీకి కొంత మంది నిఖ్ఖార్సైన కార్యకర్తలు బీఆర్ఎస్కు అండగా ఉండడంతో ప్రస్తుతం గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాల్లో గులాబీ దండు పెరిపోతూ వస్తుంది.
ఇది చూస్తున్న బీఆర్ఎస్ను వదిలి వెళ్లిన కొంతమంది ప్రజా ప్రతినిధులకు నిద్ర పట్టడం లేదు. ప్రస్తుతం బీఆర్ఎస్లో పదవులు పొందిన వారు ఇప్పుడు వారు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోలేక పోతూ ప్రజల ముందు నవ్వుల పాలు అవుతున్నారు. పదవులు పొందిన వారు పార్టీని వదిలి వెళ్తే, కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచాడు బలిగేర మాజీ సర్పంచ్ బాసు హన్మంతునాయుడుతో పాటు ఆయన సతీమణి గట్టు మాజీ జెడ్పీటీసీ బాసు శ్యామల. ఇద్దరు గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్కు అండగా ఉంటూ పార్టీ ఏ కార్యక్రమం ఆదేశించినా తూచా తప్పకుండా పాటిస్తూ గద్వాల నియోజకవర్గ గులాబీ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఆయన చొరవతో ఇక్కడి నేతలకు దిమ్మతిరిగే షాక్ నేడు ఇవ్వనున్నారు.
నేడు కేటీఆర్ సమక్షంలో చేరికలు
నేడు హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్లో గద్వాల నియోజకవర్గ నాయకుడు బాసు హన్మంతు నాయుడు ఆధ్వర్యంలో గద్వాల నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన 45మంది మాజీ ప్రజా ప్రతినిధులు (సర్పంచులు, ఎంపీటీసీలు, ముఖ్యనాయకులు, మండల పార్టీ అధ్యక్షులు) కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. ధరూర్, కేటీదొడ్డి, గద్వాల, మల్దకల్ మండలాలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్లో చేరుతుండడంతో ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెల్లో గుబులు పుట్టుకున్నది. ఇక్కడి రెండు జాతీయపార్టీలోని నాయకుల వెంట ఉంటే మా పరిస్థితి ఆగమ్యగోచరంగా మారే అవకాశం ఉందనే భావనంతో వారు పార్టీ మారడానికి సిద్ధమైనట్లు తెలిసింది.
గతంలో ధరూర్, కేటీదొడ్డి మండలాల్లో పార్టీ నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారితో పాటు గద్వాల వ్యవసాయమార్కెట్ కమిటీ మాజీ నాయకులు, గద్వాల మండలానికి చెందిన ఓ మాజీ సర్పంచ్‌తో పాటు మల్దకల్ మండలానికి చెందిన నేతలు పార్టీలో చేరుతున్నట్లు తెలిసింది. సోమవారం 100 వాహనాల్లో గద్వాల నుంచి బయలు దేరి హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. దీంతో నియోజకవర్గంలో గులాబీ జెండాకు బలం పెరగనున్నది. ఇది గద్వాల నియోజకవర్గంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల ఉపయోగపడే అవకాశంతో పాటు, రెండు జాతీయ పార్టీలకు గట్టిగా ఢీకొనే నాయకులు బీఆర్ఎస్లో సిద్దంగా ఉన్నారనే సం కేతాలు బీఆర్ఎస్ నేతలు ఇస్తున్నారు.