ఊట్కూర్ : మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, అందులో భాగంగానే గూడు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల ( Indiramma Houses ) నిర్మాణం చేపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ( Minister Vakiti Srihari) అన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని పెద్దపొర్ల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ బిల్డింగ్‌ను ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, ప్రతి నిరుపేద మహిళ కుటుంబానికి ఉచిత విద్యుత్, పెట్రోల్ పంపు, మహిళా క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేయించిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలను అమలు చేసిందని, వచ్చే నెలలో అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరి చేస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన ప్రతి ఒక్కరు వెంటనే ఇంటి నిర్మాణం పనులను ప్రారంభించుకోవాలని సూచించారు. వారం రోజుల్లో బిల్లులు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు.
జాబితాలో పేర్లు లేని వారు నిరాశ చెందవద్దని రెండో విడతలో అర్హులై ఉండి ఇల్లు రానివారికి ఇండ్లు మంజూరి చేపడతామని అన్నారు. మక్తల్ నియోజకవర్గ కేంద్రం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి రూ. 153 కోట్ల ప్రతిపాదనతో ఫోర్ లైన్ నిర్మాణానికి నిధులు మంజూరీ చేయించామన్నారు. మండల కేంద్రంలో యువత ఆటలు ఆడేందుకు ఐదు ఎకరాల స్థలం కేటాయిస్తే రూ. 1 కోటితో గ్రౌండ్ నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, హౌసింగ్ డీటీ శంకర్, తహసీల్దార్ రవి, ఎంపీడీవో ధనుంజయ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాల్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు సూర్య ప్రకాష్ రెడ్డి, మణెమ్మ, కాంగ్రెస్ నాయకులు విగ్నేశ్వర్ రెడ్డి, బస్వరాజు గౌడ్, దుర్గం శ్రీనివాసులు, ధర్మరాజు, ఎల్కోటి నారాయణ రెడ్డి, కథలప్ప మహేశ్వర్ రెడ్డి, లింగం, శంకర్, మోహన్ రెడ్డి, జగదీష్ గౌడ్, శివ రామరాజు, సత్య నారాయణ రెడ్డి, నాగి రెడ్డి, భీమ కవి, మహమ్మద్ కుర్షీద్, బషీర్ అహ్మద్ పాల్గొన్నారు.