గద్వాల,ఏప్రిల్ 23 : జోగుళాంబ గద్వాల జిల్లాలో ఎండలు మండుతున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా విపరీతమైనా ఉక్కపోతతోపాటు వేడి గాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇండ్ల నుంచి ప్రజలు ఎక్కువగా బయటకు రావడం లేదు. ఎండ వేడిమి వడగాల్పుల వల్ల ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో జిల్లా కేంద్రంతోపాటు మండల కేంద్రాలు గ్రామాల్లో రహదారులన్నీ జనం లేక బోసిపోతున్నాయి. ఒక వేళ ప్రజ లు అత్యవసరమైన బయటకు వచ్చినా ఎండ తీవ్రతను తట్టు కోవడానికి కొందరు గొడుగులు తీసుకొని బయటకు వస్తుండగా మహిళలు తమ చీర కొంగులను ఎండకు రక్షణగా తలకు చుట్టుకొని ఉ పశమనం పొందుతున్నారు. బుధవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రం, ఎర్రవల్లి, ఉండవెల్లి మండల కేంద్రంలో 41.0-29.0 ఉష్ణోగ్రత నమోదైంది. అలంపూర్లో అత్యధికంగా 42.6 ఉష్ణోగ్రత నమోదైంది. ఇటిక్యాల, మల్దకల్, మానవపాడులో 40డిగ్రీల ఉష్ణోగ్రతలు, అయిజ, ధరూర్, వడ్డేపల్లి, గట్టులో 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.