కల్వకుర్తి, జూన్ 6 : ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూ ముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు భా రీగా పెరిగాయి. భూముల విలువతో పాటు ప్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చార్జీలు 47 శాతం నుంచి 100 శాతానికి చేరాయి. పెద్ద మొత్తంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరగడంతో వినియోగదారులు విలవిలలాడుతున్నారు. ఇప్పటికే నేలచూపులు చూస్తున్న రియల్ ఎస్టేట్ రంగానికి చార్జీల పెంపు శరాఘాతంగా మరింది. చార్జీల పెంపుపై రియల్ ఎస్టేట్ వ్యాపారులతోపాటు, ప్లాట్లు, వ్యవసాయ భూములు కొనుగోలు చేసే వారు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా 47 శాతం నుంచి 100 శాతానికి ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్లకు వెనకడుగు వేస్తున్నారు.
నేషనల్ హైవేకు, ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న వ్యవసాయ భూములు, క్రయవిక్రయాలు ఓ మాదిరిగా జరుగుతున్న భూములు.. ఇలా మారు మూల గ్రామాల భూములను మూడు స్లాబులుగా విభజించారు. జాతీ య రహదారులకు ఇరువైపులా ఉన్న భూములను క్యాటగిరి-1, క్రయ విక్రయా లు సాధారణంగా జరుగుతున్న భూములను క్యాటగిరి-2గా, మారుమూల పల్లెల భూములను క్యాటగిరి-3గా విభజించి భూముల విలువ పెంచారు. ప్లాట్ల రిజిస్ట్రేషన్ల విలువ కూడా అదే విధంగా పెంచారు. గ్రామీణ ప్రాంతాలలో పాట్ల రిజిస్ట్రేషన్ల విలువను రూ.600 నుంచి రూ.900 వందలకు పెంచారు. అంటే 50 శాతం పెంచారనమాట. ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న వార్డులలో 90 నుంచి 100 శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచారు. గ్రామీణ ప్రాంతాలలో చేసిన హెచ్ఎండీఏ ప్లాట్ల ధరలను (చెర్కూర్, కుప్పగండ్ల, అజిలాపూర్ గ్రామాలలో) రూ.1100 నుంచి రూ.1350కి పెంచారు.
రియల్ ఎస్టేట్ రంగం నేలచూపులు చూస్తున్న తరుణంలో రిజిస్ట్రేషన్లు మందకొడిగా సాగుతున్నాయి. చార్టీల పెంపుతో మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదు. ఉదాహరణగా భూములు ధరలను జూన్ 5 నుంచి భారీగా పెంచుతున్నామని ప్రభుత్వం ముం దుగానే ప్రకటించింది. ధరలు పెరిగితే రిజిస్ట్రేషన్ చార్టీల మోత మొగుతుందని భావించిన వినియోగదారులు (కొనుగోలుదారులు) పెద్ద ఎత్తున్న రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పోటెత్తుతారని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో రేవంత్ సర్కారు గత మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు స్లాట్ల సంఖ్యను కూడా పెంచింది. అంటే ప్రతి రోజు 45 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేయాలనే నిబంధన ఉన్నది. ధరలు పెరుగుతుండటంతో వినియోగదారులు పెద్ద ఎత్తునే తరలివస్తారనే భావనతో ప్రభుత్వం స్లాట్ల సంఖ్యను 45 నుంచి 80కి పెంచింది. అయినప్పటికీ కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. మే 25 నుంచి జూన్ 4వ తేదీ వరకు కల్వకుర్తి సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 388 డాక్యుమెంట్లు మాత్ర మే రిజిస్ట్రేషన్ అయ్యాయి. దీనికి సంబంధించి రూ. 96,45,285 ఆదాయం మాత్రమే సమకూరింది.
ప్రతి రోజు అంతో.. ఇంతో సందడిగా కనిపించే కల్వకుర్తి రిజిస్ట్రేషన్ కార్యాలయం శనివారం బోసిబోయి కనిపించింది. మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కాలేదు. రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికే కుదేలై పడిలేస్తున్న తరుణంలో రిజిస్ట్రేషన్ చార్జీల పెంపు మరింత భారంగా మారింది. ఇప్పటికే క్రయ విక్రయాలు మందగించాయి. చార్జీల పెంపుతో రియల్ రంగం మరింత చతికిలబడే ప్రమాదంలో నెలకొన్నది.
వ్యవసాయ పొలా నికి వెళ్లేందుకు బాట కోసం నేను, మా పక్క భూ యజమాని కొంత పొలాన్ని మార్పు చేసుకుందామని అనుకున్నాం. నాకు ఉన్న భూ మి లో ఎకరా 28 గుంటలను పక్కన పొలం యజమానికి రిజిస్ట్రేషన్ చేసి ఆయనకు ఉన్న భూమిలో ఎకరా 28 గుంటల భూమిని నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. 4వ తేదీ రోజు రిజిస్ట్రేషన్‌కు సబంధించి స్లాట్ బుక్ చేసుకోవాలకుంటే సర్వర్లు పనిచేయలేదు. తప్పదని 6వ తారీకు స్లాట్ బుక్ చేసుకున్నాం. భూముల ధరలు పెరగడంతో రిజిస్టేషన్ చార్జీలను రూ.లక్ష 62 వేలు చెల్లించారు. కేవలం మూడెకరాల 16 గుంటల భూమికి అదనంగా రూ.70 వేలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఇది చాలా అన్యాయం అనిపించింది. ఒక శాతం నుంచి రెండు, మూడో శాతం పెంచితే సరే గానీ.. 40 శాతం నుం చి 100 శాతం పెంచ డం చాలా దుర్మార్గం.
– మైబు యాదవ్, తాండ్ర గ్రామం, కల్వకుర్తి మండలం