గద్వాల/అలంపూర్/శ్రీశైలం, సెప్టెంబర్ 6 : పది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కృష్ణా, తుంగభద్ర నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. దీంతో అన్ని ప్రాజక్టులకు వరద నమోదవుతున్నది. శుక్రవారం జూరాల డ్యాంకు ఇన్‌ఫ్లో 1,36,000 క్యూసెక్కులు ఉండగా.. 16 గేట్లు తెరచి దిగువకు 1,44,322 క్యూసెక్కులు వదులుతున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.869 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. విద్యుదుత్పత్తికి 30,954 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
అలాగే కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో 32,347 క్యూసెక్కులు వస్తుండగా.. 12 గేట్ల ద్వారా వరద విడుదల చేస్తుండగా.. అవుట్‌ఫ్లో 32,047 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 101.773 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో 30,337 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 29,700 క్యూసెక్కులు ఉండగా.. ఆనకట్టలో 10.2 అడుగుల మేరకు నీటి మట్టం ఉన్నది. ఆల్మట్టి ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 64,322 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 72,436 క్యూసెక్కులు నమోదైంది.
ఫుల్ లెవల్ 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 126.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నారాయణపుర ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 76,332 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 77,837 క్యూసెక్కులు నమోదుకాగా.. సామర్థ్యం 37.64 టీఎంసీలకుగానూ 37.25 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం జలాశయానికి 1.49 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఆరు గేట్ల ద్వారా 1,67,076 క్యూసెక్కులు వదులుతున్నారు.
దేవరకద్ర/కొత్తకోట, సెప్టెంబర్ 6 : కోయిల్‌సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో శుక్రవారం 5 గేట్లను తెర్చి 35వేల క్యూసెకుల నీటిని ఊకచెట్టువాగుకు వదులుతున్నారు. కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామ సమీపంలోని శంకరసముద్రం రిజర్వాయర్‌కు వరద ఉధృతి కొనసాగుతున్నది. దీంతో శుక్రవారం 5 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నట్లు ఏఈ అఖిల్ తెలిపారు. ఎగువ నుంచి 3,500 క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా 4,500 క్యూసెక్కుల నీటిని 5 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు.