కొల్లాపూర్, జూన్ 1 : రోహిణి కార్తెలోనే కృష్ణానదికి వరద వస్తోంది. వరద నీటిని ఒడిసిపట్టేందుకు పక్క రాష్ట్రం ప్రణాళికలు వేస్తుంటే కృష్ణానదిలో అత్యధిక భాగం వాటా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం పాలకులు అందాల భామల ఉచ్చులో పడి సాగునీటిపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. రాష్ర్టానికి సాగు, తాగునీరు అందించే పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల వద్ద నీటి లభ్యతపై కనీసం సంబంధిత అధికారులతో రివ్యూ కూడా చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆదివారం నాటికి శ్రీశైలం ప్రాజెక్టుకు 829 అడుగుల వరకు వరద నీరు చేరడంతో రెండు రోజుల్లోనే పది అడుగుల మేరకు శ్రీశైలంలో నీటి నిల్వలు పెరిగాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ముందు చూపుతో కృష్ణానది నీటిని దోచేందుకు చూస్తోంది. గతేడాది భారీ వర్షాలు కురిసి కృష్ణానదికి భారీగా వరద వచ్చినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల్లోని రిజర్వాయర్ల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం నీటిని నిల్వ చేయలేదు. ఈసారైనా ప్రభుత్వం మొద్దునిద్రను వీడాలని సాగునీటి రంగ నిపుణులు సూచిస్తున్నారు.
పాలమూరు జిల్లాను కరువు నుంచి కాపాడేందుకు గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టి కృష్ణానది నీటిని స్వయంగా గత సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 16, 2023లో అంజనగిరి రిజర్వాయర్‌లో రెండు టీఎంసీల నీటిని పంపింగ్ చేయించారు. గత ప్రభుత్వం హయాంలో మెగా బహుబలి ఒక మోటర్తోనే రెండు టీఎంసీల నీళ్లను పంపింగ్ చేస్తే గతేడాది కృష్ణానదికి భారీగా వరద వచ్చినా నాలుగు మెగా బహుబలి మోటర్లు కృష్ణానది నీటిని డ్రా చేసేందుకు సిద్ధంగా ఉన్నా నీటిని పంపింగ్ చేయలేకపోయారు.
మే 1న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలతో కలిసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులోని కొల్లాపూర్, కోడేరు మండలాల పరిధిలోని పంప్ హౌస్, ఓపెన్ కెనాల్ పనులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మొదటి లిఫ్ట్, వనపర్తి జిల్లా పరిధిలోని ఎదుల రిజర్వాయర్ స్టేజ్-2 పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా వందశాతం పనులు పూర్తి చేసి నీళ్లు ఇస్తామని తెలిపారు. మంత్రుల సమక్షంలోనే అధికారులు పీఆర్ఎల్ఐ మొదటి ప్యాకేజీ వద్ద నాలుగు మెగా మోటర్లు నీళ్లను పంపింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
అంతేకాదు మిగిలిన 10లక్షల క్యూబిక్ మీటర్ల పనులు చేస్తే (గత ప్రభుత్వమే 90 శాతం పనులను పూర్తి చేసింది.) నార్లాపూర్, ఎదుల, వట్టెం, కరివేన రిజర్వాయర్లలో మంత్రుల అంచనాల ప్రకారమే ఇప్పటికే 50 టీఎంసీల నీళ్లను నిల్వ చేయవచ్చు కానీ గత ప్రభుత్వానికి పేరు వస్తోందని కృష్ణానది నీటిని పంపింగ్ చేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం వచ్చే వరద నీటిని ఒడిసిపట్టేందుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది.
కృష్ణానదికి ఎగువ నుంచి వరద జలాలు వస్తుంటే వెంటనే ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలో పవర్ జనరేట్ చేస్తోంది. కృష్ణానదికి వరద వచ్చిన వెంటనే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను దోచేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కానీ కృష్ణానదిలో గతేడాది పూర్తి వాటాను వినియోగించుకోలేని తెలంగాణ రాష్ట్రం ఈసారి కూడా పాత పద్ధతిని అవలంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పోతిరెడ్డిపాడుకు దీటుగా కృష్ణానదిపై పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కట్టి తెలంగాణ వాటాను తీసుకునేందుకు గత ప్రభుత్వం సిద్ధం చేస్తే ఈ ప్రభుత్వం మాత్రం మళ్లీ తెలంగాణ రాష్ర్టానికి తెలంగాణ రైతాంగానికి చెందాల్సిన నీటి వాటాను ఏపీకి తాకట్టు పెట్టేందుకు సిద్ధమైనట్లు రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. 840అడుగులకు శ్రీశైలం నీటిమట్టం చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు గేట్లు తెరిచే అవకాశం ఉన్నట్లు కూడా కొంత మంది చర్చించుకుంటున్నారు.
ఇదే జరిగితే ఒక పోతిరెడ్డిపాడు నుంచే ఒక రోజులో 30వేల క్యూసెక్కుల నీళ్లు తరలిపోయే అవకాశం ఉంది. అలాగే ముచ్చుమర్రి, హాంద్రినీవాల నుంచి కూడా వేలాది క్యూసెక్కుల నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతాయి. కృష్ణానదిపై తెలంగాణ వాటా కోసం ప్రభుత్వం పోరాటం చేస్తూనే బేషజాలకు పోకుండా గత ప్రభుత్వ హయాంలో పూర్తి చేసిన పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులోని మెగా మోటర్ల ద్వారా కృష్ణానదిలోని తెలంగాణ వాటాలో కొంత మేరకైనా వినియోగించుకోవాల్సిన తక్షణ అవసరం ఉందని ఆ వైపు ప్రభుత్వం ఆలోచన చేయాలని సాగునీటి రంగ నిపుణులు, రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
కేసీఆర్ హయాంలోనే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టు పూర్తి కావడంతోపాటు మొదటి రిజర్వాయర్‌లో రెండు టీఎంసీల నీళ్లను పంపింగ్ చేశాం. నాలుగు మోటర్లు సిద్ధంగా ఉన్నా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తోందని కృష్ణానది నీటిని రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేయకుండా ఏపీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టారు. ఈ ఏడాది కూడా వరద వస్తోంది రిజర్వాయర్లలో ఇంజినీరింగ్ అధికారుల సూచన మేరకు వన్ బై థర్డ్ పద్ధతిలో నీటి నిల్వ చేయాలని చెప్పుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అంటే మళ్లీ తెలంగాణ నీళ్లను ఆంధ్రకు అప్పజెప్పినట్లు అవుతోంది. తెలంగాణ ప్రజలు, ఉమ్మడి పాలమూరు రైతుల దృష్టిలో విలన్‌గా మారకముందే ప్రభుత్వం మొద్దు నిద్ర వదలి కృష్ణానది నీటిని వినియోగించుకోవాలి.
– మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి