మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 30 : “పాలమూరు ప్రజలు హుషారైండ్రు.. వలసలు మాని పది మందికి పని కల్పించే స్థితికి చేరుకున్నరు. పీఎం మోదీ తెలంగాణకు ఎలాంటి మేలు చేకూర్చకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం సభలు, సమావేశాలు పెడుతున్నరు. పాలమూరు కరువు తీరేలా ప్రాజెక్టును కట్టుకుంటుంటే జాతీయ హోదా ఇవ్వకుండా ఏ మొఖం పెట్టుకొని పీఎం పాలమూరుకు వస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మంత్రి మాట్లాడారు.
మోదీ మహబూబ్‌నగర్‌కు ఇప్పటివరకు మూడుసార్లు వచ్చి పెట్టిన చోటే మళ్లీ సభలు పెడుతూ ప్రజలకు ఏం మేలు చేకూర్చారని ప్రశ్నించారు. ఏవో రెండు మాటలు చెప్పి ప్రచారం చేసి వెళ్తున్నారు తప్పా.. మహబూబ్‌నగర్‌కు ఎలాంటి ఉపయోగం లేదని దుయ్యబట్టారు. కరివెన, ఉదండాపూర్, ఐటీ టవర్, కేసీఆర్ ఎకో అర్బన్పార్కుతోపాటు 2వ తేదీన 26వేల ఎకరాల్లో జంగల్ సఫారీ ప్రారంభించి ప్రపంచ నలుమూలల నుంచి పాలమూరును చూసి వెళ్లేలా తీర్చిదిద్దుతున్నామని స్పష్టం చేశారు. మన్యకొండ ఆలయ అభివృద్ధి కోసం నివేదికలు పంపిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తిప్పి పంపిన విషయాన్ని పాలమూరు ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. మోదీ వచ్చినా, ఎంతమంది జేజమ్మలొచ్చినా ఏమీ చేయలేరని, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రతి క్షణం పాటుపడుతున్నదని తెలిపారు.
పాలమూరు పక్కనే కృష్ణానది పారుతున్నా తాగడానికి చుక్క నీరు ఇవ్వలేదని, స్వరాష్ట్రంలో ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. వారు అధికారంలో ఉన్న 18 రాష్ర్టాల్లో ఏ పథకాలు అమలు చేస్తున్నారో మోదీ చెప్పాలని డిమాండ్ చేశారు. స్వరాష్ట్రం ఏర్పడ్డాక అనతి కాలంలోనే అభివృద్ధి సాధించామన్నారు. అత్యధికంగా ట్యాక్స్‌లు చెల్లిస్తూ కేంద్రానికి అండగా నిలబడితే, కేంద్రం మాత్రం తమకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. తెలంగాణ దేశంలో అంతర్భాగమే అని ప్రతిసారి రాష్ర్టాన్ని కించపర్చేలా మాట్లాడడం మోదీకి అలవాటైందని అసహనం వ్యక్తం చేశారు. గడిచిన పదేండ్లలో అందరం కుటుంబసభ్యులుగా ఉన్నామని, గిప్పుడొచ్చి మత కల్లోలాలు సృష్టిస్తే సహించమన్నారు.
పాలమూరుకు వచ్చి పోవడం కాదు.. లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సభల్లో ప్రజలకు మాయమాటలు చెప్పడం మోదీకి అలవాటుగా మారిందని, ఇక్కడికి వచ్చే అర్హత ఆయనకు లేదన్నారు. తల్లిందడ్రులను తిట్టి చాయి పోస్తే ఎవరూ మర్చిపోరని, ఇది మోదీ గమనించాలన్నారు. అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వం అమోదించిన బిల్లులను వెంటనే అమోదించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్‌చైర్మన్ గణేశ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, సుదీప్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
‘పాలమూరు’ ఎంతో అభివృద్ధి చెందింది
పాలమూరు, సెప్టెంబర్ 30 : మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని అల్లీపూర్, జమిస్తాపూర్, తెలుగుగూడెం, బొక్కలోనిపల్లి, అప్పాయిపల్లి, ఓబులాయపల్లి, ఓబులాయపల్లి తండా, కోటకదిర, మన్యంకొండ గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అల్లీపూర్లో జీపీ భవనం, డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం, జమిస్తాపూర్‌లో సీసీరోడ్లు, బొక్కలోనిపల్లిలో బీటీ రోడ్డు ప్రారంభం, అప్పాయిపల్లిలో డ్వాక్రా భవనం, ఎస్సీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల ప్రారంభోత్సవం, ఓబులాయపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్లు, సీసీ రోడ్డు వంటి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్నారని అన్నారు. గతంలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితి ఉండేదో ప్రజలే గమనించాలన్నారు. మాయమాటల చెప్పే వారితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
పీఆర్ఎల్ఐతో మండలంలోని చెరువులు ఎల్లప్పుడూ అలుగు పారిస్తామని అన్నారు. గతంలో కేసీఆర్ ఎంపీగా ఉన్నప్పుడు గ్రామాల్లోకి వచ్చానని, అప్పట్లో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడేవారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. స్వరాష్ట్రంలో హైదరాబాద్‌కు దీటుగా పాలమూరును మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీ సుధ, వైస్ ఎంపీపీ అనిత, రెవెన్యూ అధికారులు, మండల అధికారులు, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు అల్లాఉద్దీన్, మండల కోఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, కార్యక్రర్తలు, ప్రజలు పాల్గొన్నారు.